బుధవారం, 13 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : బుధవారం, 30 జనవరి 2019 (14:04 IST)

పల్లీల పేరుతో రూ.100 కోట్లు నొక్కేశాడు...

ఓ వ్యక్తి పల్లీల పేరుతో ఏకంగా వంద కోట్ల రూపాయలు స్వాహా చేశారు. తామిచ్చిన పల్లీలు తీసుకుని, నూనె తీసిస్తే లక్షాధికారులు కావొచ్చంటూ ప్రజలను గ్రీన్ గోల్డ్ బయోటెక్ ఎండీ జిన్నా కాంతయ్య అలియాస్ జిన్నా శ్రీకాంత్ రెడ్డి మోసం చేశారని హైదరాబాద్ నగర సీపీ మహేష్ భగవత్ వెల్లడించారు. 
 
ఇదే అంశంపై ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈ మోసం ఉప్పల్ కేంద్రంగా నడిచిన దందా నడించిందన్నారు. కేవలం ఇంటర్ వరకూ చదువుకుని, ముంబైలోని ఓ లెదర్ ఫ్యాక్టరీలో కొంతకాలం పనిచేశాడని వివరించారు.
 
1991 ప్రాంతంలో హైదరాబాద్‌ నగరానికి వచ్చిన శ్రీకాంత్ సొంత వ్యాపారం ప్రారంభించి కోల్‌కతాకు చెందిన మితా బిశ్వాన్‌ను వివాహం చేసుకున్నట్టు చెప్పారు. తొలుత సిగ్మా గ్రాఫిక్స్ అండ్ స్క్రీన్ ప్రింటింగ్, నిజామాబాద్‌లో స్టాపర్స్ వరల్డ్ పేరిట అగరు బత్తీల తయారీ వంటి వ్యాపారాలు చేశాడని తెలిపారు. 
 
అంతేకాకుండా, అగర్ బత్తీల్లో యువకులకు శిక్షణ ఇస్తామని చెప్పి... నిరుద్యోగుల నుంచి రూ.75 వేల చొప్పున వసూలు చేశాడని వివరించాడు. ఆయన చేస్తున్న మోసంపై పోలీసులకు ఫిర్యాదులు అందడంతో నిఘా పెరిగింది. ఈ క్రమంలో మహాలైఫ్ ఆన్‌లైన్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట నిర్మాణ రంగంలోకి ప్రవేశించి... తన కంపెనీలో మానవ వనరుల విభాగం మేనేజర్‌గా చేరిన అహల్యా రెడ్డిని రెండో పెళ్లి చేసుకున్నట్టు చెప్పారు. 
 
ఆపై కర్నూలులో రియల్ దందా ప్రారంభించి, రూ.150 కోట్లతో 350 ఎకరాల స్థలం కొనుగోలుకు ప్లాన్ వేశాడని, ఆపై గ్రీన్ గోల్డ్ బయోటెక్‌ను ప్రారంభించి మోసాలకు తెరలేపాడని చెప్పారు. పల్లీలు ఇచ్చి నూనె తీసిస్తే రూ.లక్షలు సంపాదించవచ్చని ఆశచూపి... రూ.100 కోట్లకు పైగా స్వాహా చేశాడని తెలిపారు. ఈయనపై హైదరాబాద్, కడప, వరంగల్‌ నగరాల్లో పలు కేసులు నమోదైనట్టు సీపీ తెలిపారు.