శనివారం, 2 డిశెంబరు 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 6 సెప్టెంబరు 2022 (12:25 IST)

ఢిల్లీ లిక్కర్ స్కామ్ : తెలంగాణాలో ఈడీ సోదాలు

liquor bottles
ఢిల్లీలో వెలుగు చూసిన లిక్కర్ స్కామ్‌కు తెలంగాణాలో కూడా మూలాలు ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా, తెరాస అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కె.కవిత పేరు ప్రధానంగా వినిపిస్తుంది. దీంతో ఈ స్కామ్‌కు సంబంధించి ఎన్ఫోర్స్‌మెంట్ అధికారులు మంగళవారం తెలంగాణాతో సహా పలు ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్ నగరంలో ముగ్గురి ఇళ్ళలో సోదాలు చేస్తున్నారు.
 
వీరిలో ప్రేమ్ సాగర్, అభిషేక్ రావు, సృజన్ రెడ్డి ఇళ్లలో సోదాలు జరుగుతున్నాయి. అయితే, సోదాలు జరుగుతున్న విషయాన్ని అధికారులు ఇంకా అధికారికంగా ప్రకటించక పోవడం గమనార్హం. ఇదే కేసుకు సంబంధించి గతంలో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా ఇల్లు, కార్యాలయాల్లో కూడా ఈడీ సోదాలు జరిపిన విషయం తెల్సిందే.
 
కాగా, తాజా సోదాలు ఒక్క తెలంగాణాలోనే కాకుండా ఢిల్లీ, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యానాలోని పలు నగరాల్లో జరుగుతున్నాయి. హైదరాబాద్, బెంగుళూరు, ముంబై, గురుగ్రామ్, లక్నో తదితర నగరాల్లో ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు. 
 
కాగా, ఢిల్లీలోని సీఎం అరవింద్ కేజ్రీవాల్ సారథ్యంలోని ప్రభుత్వం కొత్త మద్యం విధానాన్ని ప్రవేశపెట్టింది. ఇందులో భారీ ఎత్తున అవినీతి జరిగిందన్నది బీజేపీ నేతల ప్రధాన ఆరోపణ. ఇదే అంశంపై సీబీఐ, ఈడీ అధికారులు ఈ స్కామ్‌తో సంబంధం ఉందని భావిస్తున్న ప్రతి ఒక్కరి ఇళ్లలో సోదాలు చేస్తున్నారు.