మంగళవారం, 31 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 5 సెప్టెంబరు 2022 (12:19 IST)

నిజామాబాద్ జిల్లా పర్యటనలో తెలంగాణ సీఎం కేసీఆర్

kcrao
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, తెరాస అధినేత్రి కేసీఆర్ సోమవారం నిజామాబాద్ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన జిల్లాలో కొత్తగా నిర్మించిన సమీకృత కలెక్టరేట్ భవనంతో పాటు జిల్లా తెరాస కార్యాలయాన్ని కూడా ప్రారంభిస్తారు. ఆ తర్వాత అక్కడ జరిగే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. సీఎం జిల్లా పర్యటన సందర్భంగా జిల్లా వ్యాప్తంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. 
 
ఈ పర్యటన కోసం సీఎం కేసీఆర్ మధ్యాహ్నం 2 గంటలకు హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాఫ్టరులో జిల్లాకు బయలుదేరి వెళతారు. మధ్యాహ్నం 2.30 గంటలకు జిల్లా కేంద్రానికి చేరుకుని తొలుత పార్టీ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. ఆ తర్వాత జిల్లా కలెక్టరేట్ కార్యాలయ భవనాలను ప్రారంభించి, అధికారులతో ఒక సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. 
 
కాగా, ఈ భవనాన్ని నిజామాబాద్ బైపాస్ రోడ్డు ప్రాంతంలో సువిశాల విస్తీర్ణంలో 25 ఎకరాల్లో రూ.60 కోట్ల వ్యయంతో నిర్మించారు. ఈ కలెక్టర్ కార్యాలయం నిర్మాణం తర్వాత బైపాస్ రోడ్డు ప్రాంతమందా పచ్చనిహారంగా మారిపోయింది. ఐదు కిలోమీటర్ల మేరకు రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటారు. 
 
ఈ భవనం ప్రారంభోత్సవం తర్వాత గిరిరాజ్ కాలేజీ మైదానంలో జరిగే భారీ బహిరంగ సభలో సీఎం కేసీఆర్ పాల్గొని ప్రసంగిస్తారు. సీఎం వెంట జిల్లా ఎమ్మెల్యేలు, మంత్రులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు ఉంటారు. ఈ బహిరంగ సభకు భారీ స్థాయిలో జనసమీకరణలో తెరాస నేతలు నిమగ్నమయ్యారు.