శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By
Last Updated : బుధవారం, 31 అక్టోబరు 2018 (09:57 IST)

నేడు ఇందిరా గాంధీ వర్థంతి... అక్టోబరు 31న ఏం జరిగిందంటే...

సరిగ్గా ఈ రోజుకు 34 సంవత్సరాల క్రితం దేశ చరిత్రలో ఏం జరిగిందో అందరికి గుర్తుండే ఉంటుంది. అంటే 1984, అక్టోబర్‌ 31వ తేదీన మాజీ ప్రధాన మంత్రి ఇందిరా గాంధీని ఆమె ఇద్దరు సిక్కు బాడీ గార్డులు కాల్చి చంపారు. పర్యవసానంగా ముందు ఢిల్లీలో, ఆ తర్వాత దేశవ్యాప్తంగా సిక్కులకు వ్యతిరేకంగా అల్లర్లు చెలరేగాయి.
 
కేంద్ర ప్రభుత్వం లెక్కల ప్రకారం ఒక్క ఢిల్లీ నగరంలోనే 2,100 మంది సిక్కులు ఊచకోతకు గురికాగా, దేశవ్యాప్తంగా 2,800 మంది ఊచకోతకు గురయ్యారు. అనధికార లెక్కల ప్రకారం ఒక్క ఢిల్లీలో మూడువేల మంది సిక్కులు, దేశవ్యాప్తంగా 8 వేల మంది సిక్కులు  ఊచకోతకు గురయ్యారన్నది అంచనా.
 
అక్టోబరు 31వ తేదీన ఢిల్లీ సఫ్దార్‌ జంగ్‌ రోడ్డులోని తన అధికార నివాసం నుంచి ఇందిర బయటకు వస్తుండగా ఉదయం సరిగ్గా 9.20 గంటలకు సత్వంత్‌ సింగ్, బియాంత్‌ సింగ్‌ అనే ఇద్దరు సిక్కు గార్డులు ఆటోమేటిక్‌ వెపన్ల ద్వారా ఆమెపైకి 30 తూటాలు పేల్చారు. అందులో మూడు తూటాలు ఆమెకు తగలకుండా పక్క నుంచి దూసుకుపోగా, 20 తూటాలు ఆమె శరీరంలోకి ఓ పక్కనుంచి లోపలికెళ్లి మరో పక్కనుంచి బయటకు దూసుకెళ్లాయి. ఏడు తూటాలు ఆమె శరీరంలో చిక్కుకున్నాయి. 
 
9.30 గంటల సమయంలో ఆమెను హుటాహుటిన ఢిల్లీలోని ఎయిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు. ఆమె మరణాన్ని ఆస్పత్రి వర్గాలు ఆరోజు మధ్యాహ్నం 2.20 గంటలకు ధ్రువీకరించాయి. ఆరోజు సాయంత్రం వార్తల్లో దూరదర్శన్‌ ఇందిరాగాంధీ మరణాన్ని అధికారికంగా ప్రకటించింది.
 
ఇందిరా గాంధీ హత్య జరిగిన రోజున రాజీవ్‌ వెస్ట్ బెంగాల్ పర్యటనలో ఉన్నారు. రాష్ట్రపతి జ్ఞానీ జైల్‌ సింగ్‌ విదేశీ పర్యటనలో ఉన్నారు. కేంద్ర హోం మంత్రి పీవీ నరసింహారావు ఢిల్లీలోనే ఉన్నారు. రాజీవ్‌ గాంధీ 4 గంటల ప్రాంతంలో ఢిల్లీకి చేరుకోగా, 5 గంటల ప్రాంతంలో జైల్‌ సింగ్‌ ఢిల్లీకి చేరుకున్నారు. 
 
ఆ తర్వాత గంటలోపలే రాజీవ్‌ గాంధీ ప్రధానమంత్రిగా రాష్ట్రపతి చేతుల మీదుగా బాధ్యతలు స్వీకరించారు. సాయంత్రం నుంచే సిక్కులకు వ్యతిరేకంగా అల్లర్లు ప్రారంభమయ్యాయి. ఈ అల్లర్లను ముందుగానే ఊహించి నివారించేందుకు ఐదుగురు సిక్కు ప్రముఖులు చేసిన విశ్వప్రయత్నాలు కేంద్ర ప్రభుత్వ వైఖరి కారణంగా ఫలించలేదు.
 
అలాగే ప్రాణాలు కోల్పోయిన ఉక్కు మహిళ, దేశ తొలి మహిళా ప్రధానమంత్రి ఇందిరా గాంధీ వర్థంతి బుధవారం జరుగుతున్నాయి. ఈ వేడుకలను పురస్కరించుకుని ఢిల్లీలోని శక్తిస్థల్‌లో ఉన్న ఆమె సమాధికి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ప్రియాంకా గాంధీతో పాటు.. ఇతర కాంగ్రెస్ సీనియర్ నేతలు నివాళులు అర్పించారు.