శనివారం, 25 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By TJ
Last Modified: మంగళవారం, 5 సెప్టెంబరు 2017 (16:56 IST)

భూమనకు జగన్ మోహన్ రెడ్డి క్లాస్... ఎందుకు?

నంద్యాల ఉపఎన్నికల్లో ఘోర పరాజయాన్ని వైసిపి అధినేత జగన్ ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. నంద్యాల ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జగన్ ఏకంగా 13 రోజుల పాటు నంద్యాల నియోజకవర్గంలో ప్రతిచోటా తిరుగుతూ ప్రజలకు నవరత్నాలపై వివరించే ప్రయత్నం చేశారు. కా

నంద్యాల ఉపఎన్నికల్లో ఘోర పరాజయాన్ని వైసిపి అధినేత జగన్ ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. నంద్యాల ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జగన్ ఏకంగా 13 రోజుల పాటు నంద్యాల నియోజకవర్గంలో ప్రతిచోటా తిరుగుతూ ప్రజలకు నవరత్నాలపై వివరించే ప్రయత్నం చేశారు. కానీ తెలుగుదేశం పార్టీ మాత్రం జగన్ పర్యటించిన ప్రాంతాల్లోనే మరుసటి రోజు తిరుగుతూ ప్రభుత్వ పథకాలను వివరించింది. మహిళలతో పాటు యువకులను ఎక్కువగా తనవైపు వచ్చేలా ప్రయత్నించి చివరకు విజయం సాధించింది. 
 
జగన్ నంద్యాలలో చేసిన వ్యాఖ్యలు.. ఆ తరువాత జగన్ పైన మూడో పట్టణ పోలీస్టేషన్‌లో జగన్ పైన ఫిర్యాదు.. ఇలా ఒక్కటేమిటి.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి వెళ్ళి ప్రచారం చేయడం కన్నా పార్టీ పరువును దిగజార్చుకుందని రాజకీయ విశ్లేషకులే చెప్పుకుంటున్నారు. వారు ఒకరే కాదు ఆ పార్టీకి చెందిన నేతలే చెప్పుకుని బాధపడి పోతున్నారు. 
 
ముఖ్యమంత్రి అయిన వ్యక్తిని నడిరోడ్డుపై కాల్చేయండి, ఉరి తీయండి.. వంటి వ్యాఖ్యలు వైసిపి నేతలను బాగా ఇరకాటంలో పెట్టేశాయి. లేవలేని స్థితిలోకి తీసుకెళ్ళిపోయాయి. నంద్యాలలో ఎక్కడ ప్రచారానికి వైసిపి నేతలు వెళ్ళినా, వాటినే తిరగతోడుతూ ప్రజలు నాయకులను ప్రశ్నించేలా చేశాయి. ఇదంతా ఒక ఎత్తయితే ఎపిలోని 13 జిల్లాలకు చెందిన వైసిపి సీనియర్ నేతలందరినీ జగన్ రంగంలోకి దింపారు. నంద్యాలలో ఒక్కో ప్రాంతంలో ఒక్కొక్కరిని ఉంచి నేతలందరినీ సమన్వయ పరిచి పార్టీ గెలుపుకు కృషి చేయాలని ఆదేశాలిచ్చారు. ఆ సీనియర్ నేతల పనితీరును గమనించేందుకు మరో సీనియర్ నేతను రంగంలోకి దించారు. ఆయనే భూమన కరుణాకర్ రెడ్డి. ఈయన వై.ఎస్.రాజశేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. వేలు విడిచిన బంధువు కూడా. 
 
అందుకే కాంగ్రెస్ పార్టీ నుంచి జగన్ మోహన్ రెడ్డి బయటకు వచ్చిన మరుక్షణం భూమన కరుణాకర్ రెడ్డి బయటకు వచ్చేశారు. పార్టీలో ఆయనకు సముచిత స్థానమే ఇచ్చారు జగన్. తన వాగ్ధాటితో ఎవరినైనా ముప్పు తిప్పలు పెట్టే కరుణాకర్ రెడ్డి గురించి పార్టీలో తెలియని వారుండరు. అలాంటి వ్యక్తి నంద్యాల ఉప ఎన్నికల్లో బాధ్యతలు అప్పగిస్తే మంచిదన్న ఉద్దేశంతో ఎన్నికలకు నెలన్నర క్రితమే వెళ్ళమని ఆదేశాలిచ్చారు.
 
జగన్ చెప్పడమే ఆలస్యం భూమన కరుణాకర్ రెడ్డి నెలన్నర పాటు నంద్యాలలోనే మకాం వేసి అందరినీ సమన్వయ పరిచే పనిలో పడ్డారు. దూరందూరంగా ఉన్న నేతలను దగ్గరకు చేర్చారు. అందరూ కలిసికట్టుగా పనిచేస్తే అభ్యర్థి విజయం ఖాయమని అందరికీ నూరిపోశాడు. అయితే అది ఏ మాత్రం నేతలకు ఎక్కలేదు. నంద్యాల అంటేనే ఫ్యాక్షనిజం. ఒకరి మాట మరొకరు అస్సలు వినరు. అలాంటిది భూమన కరుణాకర్ రెడ్డి మాటలు వింటారా. నెల రోజుల పాటు నేతలను కలిపే ప్రయత్నంలోనే భూమన ఉండిపోయారు. ఒక చెవిలో విన్న నేతలు వాటిని మరో చెవిలో వదిలేయడం ప్రారంభించారు. నేతల నేతలకు మధ్య ఉన్న గొడవే చివరకు అభ్యర్థి కొంప ముంచిందని ఓటమి తరువాత తెలుసుకున్నారు జగన్.
 
ఫలితాల తరువాత ఎవరితోను మాట్లాడని జగన్ రెండురోజుల క్రితం భూమనకు ఫోన్ చేసి చెడామడా తిట్టేశారట. మీకు చెప్పిన పని ఒకటి.. మీరు చేసింది మరొకటి. ఇలా అయితే ఎలా.. మా తండ్రికి ఇచ్చే గౌరవం మీకు ఇస్తుంటాను. అలాంటి మిమ్మల్ని నమ్ముకుని ఒక బాధ్యత అప్పగిస్తే అది సక్రమంగా చేయలేకపోయారు. ఏం చేయమంటారు.. అంటూ ప్రశ్నించారట. అధినేత ఫోన్‌లో అలా మాట్లాడితే ఎవరైనా ఏమంటారు.. అదే భూమన కూడా చేశారట. 
 
సరే సర్ అంటూ అన్నింటికి ఫోన్లో తలూపడం ప్రారంభించారట. 7 నిమిషాల పాటు జగన్ భూమనకు పెద్ద క్లాస్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే భూమన కరుణాకర్ రెడ్డి మాత్రం ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదట. పార్టీ ఓటమికి ఖచ్చితంగా ఎవరైనా బాధ్యత వహించాల్సిందేనని, అధినేత తిట్టినంత మాత్రాన బాధపడాల్సిన అవసరం లేదంటూ తన సన్నిహితులతో చెప్పారట. మరి చూడాలి జగన్ ఇంకెవరికి ఫోన్ చేసి క్లాస్ పీకుతారో?