శనివారం, 9 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By సిహెచ్
Last Updated : సోమవారం, 31 మే 2021 (11:59 IST)

World No Tobacco Day: స్మోకింగ్ మానేయాలనుకుంటారు కానీ మానలేకపోతారు, ఎలా?

ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ కోవిడ్ -19 మహమ్మారి విజృంభిస్తున్న వేళ కోట్ల మంది పొగాకు వినియోగదారులు ధూమపానం మానేయాలని కోరింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 60% మంది పొగాకు రాయుళ్లు ధూమపానం మానేయాలని కోరుకుంటారు. ఆచరణలో మాత్రం 30 శాతం కంటే తక్కువ మంది ఆ పని చేయగలుగుతారు.
 
ఈ పొగాకు ఆరోగ్యానికి చాలా హానికరం. ప్రతి సంవత్సరం పొగాకు కారణంగా 50 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. డబ్ల్యూహెచ్‌ఓ ప్రకారం, ధూమపానం చేయని వారి కంటే 50 శాతం మంది ధూమపానం చేసేవారు COVID-19 సంక్రమించే ప్రమాదం ఉంది. "పొగాకును విడిచిపెట్టండి, కరోనావైరస్ నుండి తమ ప్రమాదాన్ని తగ్గించడానికి, అలాగే క్యాన్సర్, గుండె జబ్బులు మరియు శ్వాసకోశ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడానికి చేయగల ఉత్తమమైన పని" అని WHO ప్రకటన తెలిపింది.
 
ఈ రోజున, WHO అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఈ సంవత్సరం ప్రత్యేకథీమ్ "కమిట్ టు క్విట్". అంటే పొగాకును వదిలేయాలి. మరి పొగరాయుళ్లు శపథం చేసి పొగతాగడాన్ని వదిలేయాలి.
 
ఇవాళ పొగ తాగడం ఒక స్టైల్‌గా మారింది. కానీ దానివల్ల కలిగే ఫలితాలు తీవ్రమని తెలిసినా పెద్దగా పట్టించుకోవడం లేదు. పొగతాగే వారిలో క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమంటే... పొగతాగే వారికన్నా వారు బయటకు వదిలిన పొగను పీల్చేవారు త్వరగా ఊపిరితిత్తుల సంబంధించిన వ్యాధులకు గురవుతుండటం.
 
పొగ తాగేవారిలో ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులతోపాటు పెదవి నుండి ముక్కు లోపలి భాగాల్లో, నోటి లోపల, గొంతులో, స్వరపేటిక, అన్నవాహిక, జీర్ణాశయం, కాలేయం, కిడ్నీలు, చివరికి ఎముకల మజ్జలో కూడా క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా ఊపిరితిత్తులకి ఈ అవకాశాలు ఎక్కువ.
 
పొగాకులో ఉన్న నికోటిన్ పీల్చిన వెంటనే అది మెదడుకు చేరి కేంద్ర నాడీమండలాన్ని ఉత్తేజం చేస్తుంది. ఉత్తేజంతోపాటు అది నేరుగా రక్తంలో కలుస్తుంది. ఫలితంగా మూత్రపిండాల వడపోతలో ఇది వాటిని దెబ్బతీసి కిడ్నీ క్యాన్సర్‌కి కారణమవుతుంది. అక్కడి నుండి మూత్ర నాళాలకి వ్యాప్తి చెందుతుంది.
 
పొగాకులో ఉన్న నికోటిన్ ఇతర రసాయనాలు ఒక క్రమ పద్ధతిలో జన్యువుల చేత నియంత్రించబడే కణాల పెరుగుదలని పెంచివేస్తుంది. ఫలితంగా శరీరంలో కణితలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. ఇన్ని దుష్ఫలితాలుంటాయని తెలిసినా ఈ దురలవాటుకు బానిసలవుతూనే ఉన్నారు. పొగ రక్కసి కోరల్లో చిక్కి జీవితాన్ని బలి పెట్టుకుంటున్నారు. తమ కుటుంబ సభ్యుల్ని అనాధలుగా మిగులుస్తున్నారు. పొగతాగేవారు ఇప్పటికైనా ఆ అలవాటును మానుకుంటే కుటుంబానికి తద్వారా దేశానికి మేలు చేసిన వారవుతారు.