మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరెంట్ అపైర్స్
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 5 జూన్ 2020 (10:43 IST)

ప్రపంచ పర్యావరణ దినోత్సవం.. ప్రకృతి మాతను కాపాడుదాం..

Nature
నేడు ప్రపంచ పర్యావరణ దినోత్సవం. మానవులకు మనుగడనిచ్చే ప్రకృతిని ఆరాధించాలి. ఇంకా కాపాడాలి. కానీ మనుషులు స్వార్థం కోసం వాడుకుంటూ ప్రకృతి మాతను నిర్లక్ష్యం చేస్తున్నారు. అందుకే ప్రకృతి విపరీత్యాలు జరుగుతున్నాయి. ప్రకృతి మనకు ఎంతో మేలు చేస్తున్నా.. దాన్ని మానవజాతి నాశనం చేస్తున్నారనే చెప్పాలి. అందుకే పర్యావరణాన్ని రక్షించుకోవాలనే సందేశాన్ని ప్రపంచానికి ఇవ్వాలని ప్రపంచ వ్యాప్తంగా జూన్ 5వ తేదీన ప్రపంచ పర్యావరణ దినోత్సవంగా జరుపుకుంటున్నారు. 
 
ఈ పర్యావరణ దినోత్సవం ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీచే 1972, జూన్ 5వ తేదీన జరపాలని నిర్ణయించబడింది. పర్యావరణ దినం సందర్భంగా, ఈ సంవత్సరం జూన్ 5న చైనాలో పర్యావరణానికి సంబంధించిన అంతర్జాతీయ సమావేశం జరుగుతుంది. ఈ అంతర్జాతీయ సమావేశంలో పర్యావరణానికి సంబంధించిన పలు కీలకమైన అంశాలను చర్చించటమే గాకుండా, పర్యావరణాన్ని కాపాడుకునేందుకు పలు మార్గదర్శక సూత్రాలను రూపొందిస్తుంటారు. 
 
అలాగే 1974లో ఒకే ఒక్క భూమి థీమ్‌తో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇలా ప్రతిసారీ ఒక్కో థీమ్‌తో కాన్ఫరెన్స్ నిర్వహిస్తూ ఉంటారు. 2019 సంవత్సరంలో ‘బీట్ ఎయిర్ పొల్యూషన్’పేరుతో చైనాలో సదస్సు నిర్వహించారు. ఈ ఏడాది ‘టైమ్ ఫర్ నేచర్’ థీమ్‌ను ఎంపిక చేసి.. జర్మనీ సహకారంతో కొలంబియాలో నిర్వహిస్తున్నారు
 
మన మేధో సంపత్తితో శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకుని, ప్రపంచవ్యాప్తంగా పలు పరిశ్రమలను నెలకొల్పడం జరుగుతున్నాయి. ఈ పరిశ్రమలు వెదజల్లే కాలుష్యంతో కోలుకోలేనంతగా వాతావరణం కలుషితమై... పీల్చే గాలి, త్రాగే నీరు, తినే ఆహారం.. అన్నీ కలుషితమవుతున్నాయి. మానవుడు తన స్వార్థ ప్రయోజనాల కోసం ప్రకృతి ప్రసాదించిన వనరులను అవసరానికి మించి వాడుకుంటున్నాడు. 
 
నేటి వేగవంతమైన జీవితంలో వాహన వేగం పెంచుతూ, ఇంధనకోరతకి, వాయు కాలుష్యానికి కారణం అవుతున్నాం . కార్బన్‌ మోనాక్సైడ్, కార్బన్ డై ఆక్సైడ్ లాంటి విషపూరిత వాయువులు వాతావరణంలో పరిమితికి మించి పెరగడం వల్ల క్రమంగా భూమండలం వేడెక్కుతోంది. అడవులు, జల వనరులు క్రమేపీ తగ్గిపోతున్నాయి. ఈ రకంగా, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో సాధించిన పురోగతి కూడా ప్రకృతి కాలుష్యానికి కారణమవుతోంది. ముఖ్యంగా ఈ సంవత్సరం ఈ సమావేశంలో వాయు కాలుష్యంపై దృష్టి పెడుతున్నారు. రోజురోజుకూ భూగోళంపై పచ్చదనం తగ్గిపోవడం, కొన్ని రకాల జీవరాశులు నశించిపోవడం వల్ల పర్యావరణానికి పెను ముప్పుగా పరిణమించింది.
 
ప్రపంచాన్ని ప్రస్తుతం కరోనా వైరస్ మహమ్మారి వణికిస్తోంది. దీంతో పలు దేశాలలో లాక్‌డౌన్‌ వల్ల అన్ని పనులు ఆగిపోవడంతో కర్బన ఉద్గారాలూ తగ్గాయి. భారతదేశంలోనూ ప్రజా రవాణా నిలిచిపోయి ఇంధనాల వాడకం దాదాపు 66 శాతం తగ్గింది. ఇంధనానికి డిమాండు తగ్గడంతో చమురు ఉత్పత్తీ, బొగ్గు తవ్వకాలు తగ్గిపోయాయి. ఫలితంగా చరిత్రలో కనీవినీ ఎరగని రీతిలో అన్ని రకాల కాలుష్యాలకూ అడ్డుకట్ట పడింది.
 
భారతీయులకు పవిత్రమైన గంగానది తీరం పొడవునా ఉన్న పరిశ్రమల నుంచి వచ్చే రసాయన వ్యర్థాలతో, యాత్రికులు పడేసే చెత్తతో కలుషితమైపోయి, తాగడానికి కాదు కదా, స్నానానికి కూడా పనికిరాని పరిస్థితికి చేరుకుంటోంది. గంగానదిని శుభ్రం చేయాలంటూ ఎందరో ఆందోళనలు చేస్తూసే ఉన్నారు. ప్రభుత్వాలు కూడా ప్రక్షాళనకు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నా పరిస్థితిలో ఇసుమంత కూడా మార్పు లేదు. అలాంటిది లాక్‌డౌన్‌‌తో ఫ్యాక్టరీల మూసివేయడం వల్ల వ్యర్థాలు నదిలోకి రావడం ఆగిపోయి గంగమ్మ కొత్త అందాలను సంతరించుకుంది. కాబట్టి పర్యావరణాన్ని కాపాడేందుకు మానవులే కృషి చేయాలనే విషయాన్ని మరిచిపోకుండా.. ప్రకృతి మాతను కాపాడుదాం..