సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. పండుగలు
Written By సిహెచ్
Last Modified: సోమవారం, 2 నవంబరు 2020 (22:51 IST)

నవంబరు 3 అట్ల తద్ది, ఈ ఒక్క పని చేస్తే గుణవంతుడైన భర్త లభిస్తాడు

అట్ల తద్ది రోజున అమ్మవారిని ఎక్కువగా ఆరాధిస్తుంటారు. ఆశ్వయుజ బహుళ తదియ రోజున జరిపే అట్లతద్దె నాడు ఉమాదేవిని పూజించాలని పురాణాలలో చెప్పబడింది. అలానే ఈ రోజున చంద్రోదయం వరకు ఉపవాస దీక్షను చేపట్టి ఆ అమ్మవారికి అట్లను నైవేద్యంగా సమర్పించాలి. అలానే ముత్తయిదువులకు వాయనం ఇవ్వాలి. ఈ రోజున ఈ నోమును ఆచరించడం వలన వివాహం కానివారికి గుణవంతుడైన భర్త లభిస్తాడు. వివాహమైనవారికి నిండు ఐదవతనం లభిస్తుందని విశ్వాసం. 
 
ఈ అట్ల తద్దికి సంబంధించి ఓ కథ వుంది. పూర్వం ఒక మహారాజుకు లావణ్యవంతమైన కుమార్తె ఉండేది. ఆమెపేరు కావేరి. కావేరి తన తల్లి ద్వారా అట్లతద్దె వ్రతమహిమను తెలుసుకుని తన రాజ్యమందుగల ఆమె స్నేహితురాళ్లు మంత్రి కూతురు, సేనాపతి కూతురు, పురోహితుని కూతురుతో కలిసి ఈ చంద్రోదయ ఉమావ్రతాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో ఆచరించింది. కాని.. తోటి మంత్రి, సేనాపతి, పురోహితుని కూతుళ్లకు వివాహ వయస్సు రాగానే నవయవ్వనులైన అందమైన భర్తలతో వివాహం జరిగింది. 
 
దీంతో మహారాజు అమ్మాయి స్నేహితురాళ్లకు వివాహములు జరిగిపోవుచున్నవని తలచి తన కుమార్తెకు వివాహప్రయత్నాలు చేయడం ప్రారంభించారు. కానీ కావేరిపై యవ్వనులు గాకుండా వృద్ధులైన వారే పెండ్లికుమారులుగా తారసపడసాగిరి. 
 
మహారాజు ప్రయత్నములన్నీ విఫలం కావడం చూచిన రాకుమార్తె కావేరి ఎంతో కలతచెంది.. రాజ్యమును వదిలి సమీప అరణ్యములో ఘోర తపస్సు చేసింది. ఒకరోజు పార్వతీ పరమేశ్వరులు కావేరీకి ప్రత్యక్షమై ఏ వరం కావాలో కోరుకోమనగా, కావేరి తన అట్లతద్దె వ్రతాచరణ చేసినా ఫలితం దక్కలేదని, నా వ్రతములో ఏదైనా దోషమేమిటని? ప్రశ్నిస్తూ.. దుఃఖించసాగింది.
 
అంతటితో పార్వతీపరమేశ్వరులు ఓ సౌభాగ్యవతి.. ఇందులో నీ దోషము ఏ మాత్రము లేదు. నీవు ఆ అట్లతద్దె నోచే సమయంలో ఉపవాసదీక్షకు తట్టుకోలేక సొమ్మసిల్లి పడిపోగా, విషయమంతా నీ తల్లిద్వారా తెలుసుకున్న నీ సోదరులు ఒక ఇంద్రజాల విద్యను ప్రదర్శించి అద్దముగుండా నీకు చంద్రునిని చూపించినారు.
 
దానితో నీవు ఉపవాస దీక్షను విరమించినావు. ఆ వ్రత భంగమే ఇదని ఆది దంపతులు వివరించారు. నీ సోదరులకు నీపై గల వాత్సల్యముతో అలా చేశారని, ఇందులో నీవు దుఃఖించవలసిందేమీ లేదని, రేపువచ్చే ఆశ్వీయుజ బహుళ తదియనాడు విధివిధానంగా వ్రతమాచరించు. నీ మనోభిష్టము తప్పక నెరవేరుతుందని కావేరిని ఆశీర్వదించి అంతర్ధానమైనారు. 
 
అలా ఆ రాకుమార్తె తిరిగి శ్రద్ధాభక్తులతో వ్రతమాచరించి మంచి అందమైనవాడు, చక్కని శౌర్యపరాక్రమములు కలిగిన నవయవ్వన రాకుమారునితో వివాహమై నిరంతరము ఉమాశంకరులను సేవిస్తూ సమస్త సుఖభోగములను అనుభవించసాగింది. అందుచేత మనం కూడా అట్లతద్దె రోజున ఉమామహేశ్వరులను నిష్ఠతో పూజించి వారి అనుగ్రహముతో అష్టైశ్వర్యాలను పొందుదాం.