1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Actor Arjun Sarja Slams Defamatory Allegations Against Elder Daughter Aishwarya, Files Complaint

నా బిడ్డపై నిరాధార ఆరోపణలు చేస్తే కఠిన చర్యలు : 'యాక్షన్ కింగ్' అర్జున్

arjun
తన పెద్ద కుమార్తె ఐశ్వర్య వ్యక్తిగత జీవితంపై సోషల్ మీడియాలో సాగుతున్న అసత్య ప్రచారాలు, నిరాధార ఆరోపణలపై సీనియర్ హీరో, యాక్షన్ సింగ్ అర్జున్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తన కుమార్తె జీవితంపై అసత్య ప్రచారం చేస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ముఖ్యంగా ఒక తండ్రిగా తన కుమార్తె గౌరవం, స్వేచ్ఛ, స్వతంత్ర జీవన హక్కుకు ఎల్లప్పుడూ అండగా నిలబడతానని స్పష్టం చేశారు. ఆమెపై లేనిపోని నిందలు వేస్తూ, అసత్య కథనాలను వ్యాప్తి చేస్తున్న వారిపై ఇప్పటికే అధికారికంగా ఫిర్యాదు చేశామని, ఇకపై కూడా ఇలాంటి వాటిని ప్రచారం చేస్తే కఠినమైన చట్టపరమైన చర్యలు తప్పవని ఆయన గురువారం హెచ్చరించారు.
 
ఈ మేరకు అర్జున్ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా ఒక ప్రకటనను విడుదల చేశారు. ఇటీవల తన చిన్న కుమార్తె అంజన వివాహం జరిగిందని, ఆ సందర్భంగా తమ కుటుంబానికి శుభాకాంక్షలు, ఆశీస్సులు అందించిన ప్రతి ఒక్కరికీ ఆయన ముందుగా కృతజ్ఞతలు తెలిపారు. అయితే, ఈ సమయంలో తాను ఎన్నడూ ఊహించని విధంగా ఒక సున్నితమైన అంశంపై బహిరంగంగా మాట్లాడాల్సి వస్తోందని ఆయన విచారం వ్యక్తం చేశారు. 
 
అంజన వివాహ సమయంలో తన పెద్ద కుమార్తె విశ్వర్య వ్యక్తిగత జీవితంపై పెద్ద ఎత్తున ఊహాగానాలు చెలరేగాయని, అయితే అది పూర్తిగా ఆమె వ్యక్తిగత విషయమైనందున ఆమె గోప్యతను గౌరవించి తాను ఇప్పటివరకు మౌనంగా ఉన్నానని అర్జున్ పేర్కొన్నారు.
 
ప్రతి మహిళకు తన జీవితానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకునే హక్కు, తన నిబంధనల ప్రకారం జీవించే స్వేచ్ఛ ఉంటాయని అర్జున్ తెలిపారు. సరైన సమయం వచ్చినప్పుడు తన గురించి తానే స్వయంగా మాట్లాడుతుందని స్పష్టం చేశారు. అయితే ఒక తండ్రిగా.. తన కూతురి క్యారెక్టర్‌ను కించపరుస్తూ, వ్యక్తిగత జీవితంపై అసత్యమైన, అభ్యంతరకరమైన ఆరోపణలు చేస్తుంటే చూస్తూ ఊరుకోలేనని ఆయన హెచ్చరించారు. 
 
నటీనటులుగా పబ్లిక్ లైఫ్‌లో ఉన్నప్పుడు తమపై పరిశీలన, సాధారణ ఊహాగానాలు రావడం సహజమేనని, కాన ఊహాగానాలకు, ఉద్దేశపూర్వకంగా చేసే అసత్య ప్రచారాలకు చాలా తేడా ఉందని అర్జున్ గుర్తుచేశారు. ప్రజల దృష్టి ఉన్న మాత్రాన ఎవరికైనా ఇష్టానుసారంగా కట్టుకథలు అల్లే అధికారం గానీ, ఒకరి వ్యక్తిత్వ హననానికి పాల్పడే హక్కు గానీ ఉండదని ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు. ఎలాంటి ఆధారాలు లేకుండా ఒక మహిళను ఆల్కహాలిక్ అంటూ ముద్రవేయడం అత్యంత బాధ్యతారాహిత్యమని, తీవ్ర అభ్యంతరకరమని మండిపడ్డారు.
 
తాము ఎల్లప్పుడూ మౌనాన్ని ఒక హుందాతనంగా భావిస్తామని, అయితే ఆ మౌనాన్ని బలహీనతగా లేదా తప్పును అంగీకరించినట్లుగా భావించకూడదని అర్జున్ తేల్చిచెప్పారు. అసత్యాలను పదేపదే ప్రచారం చేస్తూ పెంచి పోషిస్తుంటే చూస్తూ ఊరుకోబోమని, అందుకే ఇప్పటికే సంబంధిత అధికారులకు తాము అధికారికంగా ఫిర్యాదు చేశామని తెలిపారు. జర్నలిజం, వార్తా ప్రసార రంగంపై తనకు ఎంతో గౌరవం ఉందని, కానీ కొన్ని మీడియా వర్గాలు కేవలం కంటెంట్ అమ్ముకోవడం కోసమే నిజాలతో సంబంధం లేకుండా అసత్య ఆరోపణలను సంచలనంగా మార్చడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. 
About Writer
ఠాగూర్
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
కన్నతల్లి అంత్యక్రియలకు చేతిలో చిల్లిగవ్వ లేదు.. అపుడు ఆమె ఆదుకుంది : ధన్‌రాజ్