జీవితం సాఫీగా హ్యాపీగా సాగిపోవాలంటే..... కబుర్లు చెప్పుకోండి..
జీవితం సాఫీగా హ్యాపీగా సాగిపోవాలంటే కబుర్లు చెప్పుకోండి అంటున్నారు.. మానసిక నిపుణులు. ఎక్కువ కాలం జీవించాలనుకుని ఏవేవో మందులు వాడకుండా హాయిగా కబుర్లు చెప్పుకుంటే సరిపోతుందని వారు చెబుతున్నారు. సంతోషంగా ఎక్కువ కాలం బతకాలనుకుంటే కేవలం చక్కగా కబుర్లు చెప్పుకుంటే.. జీవితకాలం పెరుగుతుందని ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీకి చెందిన రాబిన్ డంబర్ అనే పరిశోధకుడు తెలిపారు. దీనిపై ఇప్పటికే పరిశోధనలు జరిగాయని రాబిన్ వెల్లడించారు.
కబుర్లు చెప్పడం ద్వారా జీవనపరిమాణం పెరుగుతుందని, ఇలా కబుర్లు చెప్పుకోవడం వల్ల మనకు తెలిసిన, తెలియన విషయాలు దొర్లుతాయని, వీటి వల్ల జ్ఞాపకశక్తి కూడా మేల్కొంటుందని, మనం ఎవరినైనా కలిసినప్పుడు వారికి సంబంధించిన విషయాలు గుర్తుకు వస్తాయన్నారు. వారితో స్నేహం కావాలో వద్దో కూడా మెదడు బోధిస్తుందని ఆయన వెల్లడించారు.
అందువల్ల ఎవరి గురించైనా పాజిటివ్‌గా మాట్లాడుకుంటే ఆయుష్షు ప్రమాణం పెరుగుతుందని చెప్పారు. చెడుగా మాట్లాడుకుంటే జీవనకాలం పెరగకపోగా, ఒత్తిడి, నెగిటివ్ ఆలోచనలు పెరిగి మానసిక వ్యాధిబారినపడే ప్రమాదముందని మానసిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే హాయిగా మంచి కబుర్లు చెప్పుకోండి..