శుక్రవారం, 3 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. వ్యాధి
Written By సిహెచ్
Last Updated : శుక్రవారం, 16 సెప్టెంబరు 2022 (17:03 IST)

సీజనల్ వ్యాధులు డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ లక్షణాలు: నివారణ మార్గాలు

Dengue
సీజనల్ వ్యాధులతో తెలుగు రాష్ట్రాలు వణికిపోతున్నాయి. ముఖ్యంగా తెలంగాణలో డెంగ్యూ, టైఫాయిడ్, మలేరియా వ్యాధులతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. అలాగే కొన్నిచోట్ల చికున్ గున్యా కేసులు కూడా కనబడుతున్నాయి. దోమల వల్ల చికున్ గున్యా వస్తుంది. ఇది కీళ్లలో తీవ్రమైన నొప్పిని కలిగిస్తుంది. ఇది ఎల్లో ఫీవర్ దోమల ద్వారా మాత్రమే వ్యాపిస్తుంది. అలాగే టైఫాయిడ్. ఇది వర్షాకాలంలో వచ్చే సాధారణ వ్యాధి. ఇది నీటి వల్ల లేదా కలుషితమైన, అపరిశుభ్రమైన ఆహారాన్ని తీసుకోవడం వల్ల వస్తుంది. ఇది సాల్మొనెల్లా టైఫీ అనే బ్యాక్టీరియా ద్వారా వ్యాపిస్తుంది. ఇందులో జుట్టు రాలడం, బరువు తగ్గడం, కండరాల బలహీనత వంటివి ఉండవచ్చు. శరీరంలో అధిక జ్వరం, తలనొప్పి, ఇన్ఫెక్షన్ ఉంటాయి.

 
వైరల్ జ్వరం, దీనిని సీజనల్ ఫీవర్ అని కూడా అంటారు. వాతావరణంలో మార్పుల కారణంగా ఇది జరుగుతుంది. ప్రధానంగా వ్యాధినిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు దీని బారిన పడుతున్నారు. దీని ప్రధాన లక్షణాలు జలుబు-దగ్గు, తరచుగా తుమ్ములు, తలనొప్పి. అలాగే డెంగ్యూ వ్యాధి దోమలు కుట్టడం ద్వారా వ్యాపిస్తుంది. దీని దోమ స్పష్టమైన, లోతైన నీటిలో సంతానోత్పత్తి చేస్తుంది. ఈ దోమకు చారలు ఉంటాయి. ఈ దోమ కాటు వల్ల కీళ్ల నొప్పులు, ప్లేట్‌లెట్స్ పడిపోవడం, బలహీనత ఏర్పడతాయి.

 
దోమల వల్ల మలేరియా వ్యాపిస్తుంది. ఇది ఆడ అనాఫిలిస్ దోమ కాటు ద్వారా వ్యాపిస్తుంది. వర్షాల సమయంలో ఈ దోమలు పుట్టే ప్రదేశాల్లో నీరు నిండుతుంది. ఈ నీటిలో పుట్టిన దోమ కాటుతో జ్వరం వచ్చి దేహం అంతా వణికిపోతుంటుంది. కండరాల బలహీనత కూడా కనబడుతుంది. కలరా వ్యాధి. ఇది వర్షాకాలంలో భోజనం చేసేటప్పుడు, తాగేటప్పుడు కలుషిత పదార్థాలను తినడం ద్వారా వ్యాపిస్తుంది. దీని బ్యాక్టీరియా మురికి నీటిలో వృద్ధి చెందుతుంది. ఇది కడుపు నొప్పి, తరచుగా వాంతులు, విరేచనాలు నీరు కోల్పోవడం జరుగుతుంది.

 
ఆహారం- నీటి ద్వారా సంక్రమించే వ్యాధుల నివారణకి చిట్కాలు
శుభ్రమైన- సురక్షితమైన త్రాగునీటిని మాత్రమే తీసుకోవాలి. అవసరమైతే వేడి చేసి చల్లార్చిన నీటిని తాగాలి.
ఆహారాన్ని వండేటపుడు తగినంత పారిశుధ్యం పట్ల జాగ్రత్త వహించండి
చేతులను నీళ్లతో కడుక్కుని శుభ్రంగా వుంచుకోవాలి.
పండ్లు- కూరగాయలను బాగా నీటితో కడగాలి, ఉప్పు నీటిలో వేసి కడిగినా మంచిది.
పరిసర ప్రాంతంలోని బహిరంగ కాలువలు, గుంతలు కప్పబడి ఉన్నాయో లేదో చూసుకోవాలి. లేనట్లయితే అధికారులకు ఫిర్యాదు చేయాలి.
జంతువుల మూత్రంతో కలుషితమైన నీటిలో ఈత కొట్టవద్దు
వ్యాధి సోకిన పెంపుడు జంతువులకి దూరంగా వుండాలి.
పిల్లలకు ఇప్పటికీ టీకాలు వేయకపోతే వాటిని వేయించండి.

Malaria
గాలి ద్వారా వ్యాపించే వ్యాధుల నివారణ చిట్కాలు
దగ్గినప్పుడు లేదా తుమ్మేటప్పుడు నోటి వద్ద ఖర్చీఫ్ పెట్టుకోవాలి.
ఇంట్లో ఎవరైనా సీజనల్ వ్యాధుల బారిన పడ్డప్పుడు వారి నుంచి పిల్లల్ని దూరంగా వుంచాలి.
పిల్లలు ఆరుబయట నుండి ఇంటికి వచ్చిన తర్వాత చేతులు- కాళ్ళు శుభ్రంగా కడుక్కుని రావాలని చెప్పండి.
రెండు మూడు గంటలకు ఒకసారి గోరువెచ్చని నీరు త్రాగాలి
ఇళ్లను ఎల్లవేళలా బాగా గాలి,వెలుతురు వచ్చేలా చూసుకోండి
ప్రతి సంవత్సరం ఫ్లూ వ్యాక్సిన్‌తో టీకాలు వేయించుకోవాలి.

 
వీటితో పాటు సరైన ఆహాహాన్ని తీసుకుంటే వ్యాధులు వచ్చినప్పటికీ రోగనిరోధక శక్తి వుంటుంది కనుక తేలికగా అధిగమించవచ్చు. మారుతున్న కాలానికి తగ్గట్టుగా సరైన పోషకాహారాన్ని తీసుకోవాలి. విటమిన్లు, మినరల్స్, పోషకాలు రోగనిరోధకశక్తిని పెంచుతాయి.

 
1. విటమిన్ సి ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం వల్ల వైరస్‌పై పోరాడి ఇన్‌ఫెక్షన్లు రాకుండా కాపాడుతుంది. టమోటా, బంగాళదుంప వంటి కూరగాయల్లో, నారింజ, నిమ్మ, కమలా, కివి పండ్లలో విటమిన్‌ సి అధికంగా ఉంటుంది. 
 
2. శరీరం కోల్పోయిన యాంటీ బాడీ కణాలు తిరిగి పునఃనిర్మితం కావడంలో తోడ్పడుతుంది. గుడ్లు, మాంసం, పెరుగు, పాలు, సీఫుడ్‌లలో జింక్‌ లభిస్తుంది.
 
3. ప్రతిరోజూ ఒక కప్పు తాజా పెరుగును తీసుకోవాలి. ఇది జీర్ణాశయంలో ఉండే బాక్టీరియాను నిర్మూలిస్తుంది. 
 
4. ప్రతిరోజు అరకప్పు తాజా క్యారెట్‌ను తినాలి. దీనిలో ఉండే బీటా కెరోటిన్‌, విటమిన్‌ బి6లు యాంటీ బాడీ కణాలు ఉత్పత్తిని ఉత్తేజపరుస్తాయి. దీనిలో ఉండే మినరల్స్ బాక్టీరియా, ఫంగస్‌ ఇన్‌ఫెక్షన్‌లపై పోరాడేలా చేస్తాయి. ప్రతిరోజూ ఆహారంలో ఒక స్పూన్‌ వెల్లుల్లి తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. 
 
5. రోజూ నాలుగు లేదా ఐదు ఖర్జూరాలను తీసుకోవడం వల్ల శరీరంలో సరిపడా ఐరన్‌ పెరుగుతుంది. దీనిలో విటమిన్‌ సి, పొటాషియం అధిక మోతాదులో ఉంటాయి. దీనివల్ల అధిక రక్తపోటుని తగ్గించి రోగనిరోధక శక్తిని పెంచుతుంది.