తలనొప్పికి శుభ్రతకు.. మంచి పోషక ఆహారానికి లింకేంటి?
తలనొప్పులు చాలా రకాలున్నాయి. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు విపరీంతగా వ్యాయామం చేస్తే కూడా తలనొప్పి వస్తుంది. ఎందుకంటే వ్యాయామం చేసేటప్పుడు శరీరానికి గ్లూకోజ్ అవసరం ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి సమయంలో మెదడుకు గ్లూకోజ్ సరిగా అందకపోవడంతో తలనొప్పి తీవ్రంగా వస్తుందంటున్నారు వైద్యులు.
ఎక్కువ సమయం నిద్రపోతే లేదా తక్కువ సమయం నిద్రపోతే, నిద్ర సరిగా పట్టకపోతే కూడా తలనొప్పి అధికంగా వస్తుంది. కొన్ని సార్లు నిద్రనుండి మధ్యమధ్యలో మేల్కొంటుంటే కూడా తలనొప్పి వస్తుందంటున్నారు నిపుణులు. దంతాలలో తీవ్రమైన నొప్పి ఉండటం వల్ల తలనొప్పి వస్తుంది. దంతాల్లో క్రిములు చేరడం, జ్ఞానదంతం రావడం, తదితరాల కారణాల వల్ల తలనొప్పి వస్తుంది.
మానసికపరమైన ఒత్తిడి కారణంగా కూడా తలనొప్పి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. నిద్రలేమి, అలసట తదితరాల కారణంగా తలనొప్పి రావడం జరుగుతుంటుంది. కళ్ళజోళ్లు మార్చకపోయినా తలనొప్పి వస్తుంటుంది. విపరీతంగా తలనొప్పి వస్తుంటే కంటి నిపుణుల వద్దకు వెళ్ళి చికిత్స చేయించుకోవాలంటున్నారు వైద్యులు.
మైగ్రేన్ తలనొప్పి... తలలోని ఓ వైపు మాత్రమే ఈ తలనొప్పి వస్తుంటుంది. ఈ నొప్పి రావడానికి కారణం మనం తీసుకునే ఆహారంలో మార్పుల కారణంగా ఈ నొప్పి వస్తుంటుంది. అధిక ఒత్తిడి కారణంగా కూడా ఈ నొప్పి వస్తుంటుంది. జలుబు, వాతావరణ పరిస్థితుల మార్పులు, ధూమపానం ఎక్కువగా సేవించడం కారణంగా తలనొప్పి వస్తుంటుంది. కాబట్టి శుభ్రతను పాటిస్తూ... మంచి పోషక విలువలున్న ఆహారాన్ని తీసుకోండి. మరీ విపరీతంగా తలనొప్పి వస్తుంటే వైద్యులను సంప్రదించండి.