ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సందీప్
Last Updated : మంగళవారం, 30 ఏప్రియల్ 2019 (16:26 IST)

మసాలా దినుసులతో ఎన్ని ఉపయోగాలో?

మనం రోజూ కూరల్లో ఉపయోగించే మసాలా దినుసుల వలన చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అనేక రోగాలకు ప్రథమ చికిత్సలా పనిచేస్తాయి. మసాలా దినుసుల వలన ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం. 
 
అజీర్తితో బాధపడేవారు అల్లం తీసుకుంటే ఉపశమనం కలుగుతుంది. కడుపులో గ్యాస్ సమస్యను కూడా అల్లం దూరం చేస్తుంది. దగ్గు, జలుబు, కఫానికి దివ్యౌషధంగా పనిచేస్తుంది. ఉబ్బసంతో బాధపడేవారు అల్లం రసంలో కొద్దిగా తేనె కలుపుకుని తాగితే ఫలితం కనిపిస్తుంది.
 
మధుమేహ రోగులకు మెంతులు ఆయుర్వేద మందు. ప్రతిరోజూ మెంతులు తీసుకోవడం వలన రక్తం పలుచగా తయారవుతుంది. ఉదయాన్నే పరగడుపున మెంతుల చూర్ణం నీళ్ళలో కలిపి తీసుకుంటే మోకాళ్ళ నొప్పుల నుండి బయటపడవచ్చు.
 
పసుపు శరీరానికి కావలసిన వేడిని ఉత్పత్తి చేస్తుంది. రక్తాన్ని కూడా శుద్ధం చేస్తుంది. కఫం, వాత, పిత్త రోగాలను నయం చేసే గుణాలు పసుపులో ఉన్నాయి. జలుబు, పొడి దగ్గు వచ్చినప్పుడు పుసుపు పొడిని వేడి నీటిలో గానీ లేదా పాలలో గానీ కలుపుకుని తాగితే ఉపశమనం పొందవచ్చు. పసుపు వ్యాధి నిరోధక శక్తిని సమర్థవంతంగా పెంచుతుంది.
 
వేడి చేసినప్పుడు సోంపు తింటే చలువచేస్తుంది. భోజనానంతరం చాలా మంది కొద్దిగా సోంపు తింటారు. ఇది నోటి నుండి దుర్వాసన రాకుండా శుభ్రపరుస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరచడంలో జీలకర్ర బాగా పనిచేస్తుంది. కడుపు ఉబ్బరాన్ని నివారిస్తుంది.  
 
తులసిలో శరీరాన్ని చల్లబరిచే గుణముంది. శ్వాస సంబంధిత జబ్బుతో బాధపడేవారు దీనిని తీసుకోవడం వలన ఉపశమనం పొందవచ్చును. ధనియాలు కంటి చూపుకు మంచిది.