మంగళవారం, 26 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By ivr
Last Modified: బుధవారం, 16 ఆగస్టు 2017 (19:36 IST)

నలభై ఏళ్లు దాటాక స్త్రీ,పురుషుల పరిస్థితి ఇంతే... ఐతే?

నలబై ఏళ్లు రాగానే ఆందోళన మొదలవుతుంది. ఇది చాలా సహజం. ఎందుకో.... అలసట, నిరుత్సాహం, దిగులు. ఇందుకు మానసిక సమస్యలే కారణమనుకునే చాలా మంది అభిప్రాయం. వాస్తవానికి మానసిక సమస్యలేవీ లేకున్నా ఇది తప్పదు. శరీరంలో టెస్టోస్టిరాన్‌ హార్మోన్‌ లోపాలు పురుషులను, ఈస్

నలబై ఏళ్లు రాగానే ఆందోళన మొదలవుతుంది. ఇది చాలా సహజం. ఎందుకో.... అలసట, నిరుత్సాహం, దిగులు. ఇందుకు మానసిక సమస్యలే కారణమనుకునే చాలా మంది అభిప్రాయం. వాస్తవానికి మానసిక సమస్యలేవీ లేకున్నా ఇది తప్పదు. శరీరంలో టెస్టోస్టిరాన్‌ హార్మోన్‌ లోపాలు పురుషులను, ఈస్ర్టోజన్‌ హార్మోన్‌ లోపాలు స్త్రీలను సతమతం చేస్తాయి. 
 
ఈ హార్మోన్లన్నీ శరీరంలో తయారయ్యే రసాయనాలే. ఇవి లైంగిక హార్మోన్లు. టెస్టోస్టిరాన్లు పురుష లక్షణాలను కలిగిస్తే, ఈస్ర్టోజన్‌ హార్మోన్లు స్త్రీ లక్షణాలను కలిగిస్తాయి. ఇవి రక్తం ద్వారా శరీరమంతా వ్యాపిస్తాయి. పురుషుల అంగ స్తంభనలకు, వీర్యకణాల ఉత్పత్తికీ ఈ హార్మోన్లే మూలం. అలాగే ప్రోస్టేట్‌ కణాల ఉత్పత్తిలో కూడా ఈ హార్మోన్ల పాత్ర ఉంది. ఎముకలు, కండరాల దృఢత్వానికి ఈ హార్మోన్లే ఆధారం. 
 
శృంగార వాంఛను కలిగించేవి ఈ హార్మోన్లే. అయితే ఈ హార్మోన్ల ఉత్పత్తి తగ్గిపోయినప్పుడే సమస్యలు మొదలవుతాయి. ఇలా తగ్గడాన్ని హైపోగొనాడిజం అంటారు. 40 ఏళ్ల తరువాత క్రమంగా టెస్టోస్టిరాన్‌ హార్మోన్ల ఉత్పత్తి తగ్గుతూ వెళుతుంది. యేటా ఒక శాతం ఉత్పత్తి తగ్గుతూ 70 యేళ్లు వచ్చేసరికి ఈ ఉత్పత్తి 30 శాతానికి పడిపోతుంది. ఇందుకు భిన్నంగా కొందరిలో ఉత్పత్తి చాలా వేగంగా తగ్గిపోతుంది. 
 
దీని వల్ల లైంగిక సామర్థ్యం, వాంఛ వేగంగా తగ్గడంతో పాటు నీరసం, అలసట, దిగులు, ఆందోళన, జ్ఞాపక శక్తి తగ్గడం, ఏకాగ్రతా లోపాలు తలెత్తుతాయి. చికాకు, కోపం, మొదలవుతాయి. నిద్రలేమితో పాటు కీళ్ల నొప్పులు మొదలవుతాయి. 
 
హార్మోన్‌ ఉత్పత్తికి ఇలా చేయాలి
టెస్టోస్టిరాన్‌ హార్మోన్లు హఠాత్తుగా 50 శాతం కన్నా తగ్గిపోతే యూరాలజిస్టును సంప్రదించడం అవసరం. ఇలాంటి  పరిస్థితులలో కృత్రిమంగా ట్టెసోస్టిరాన్‌ హార్మోన్లు అందించడం అవసరం. హార్మోన్లు మాత్రలు, ఇంజెక్షన్ల రూపంలో లభిస్తున్నాయి. వీటిని ప్రతి రెండు మూడు వారాలకు ఒకటి చొప్పున తీసుకోవచ్చు. వైద్యుల సలహా మేరకు వీటిని వాడాలి. అనవసరంగా వాడితే కొత్త సమస్యలను కొని తెచ్చుకున్నట్లే. 
 
ఆహార నియమాలు 
క్రమం తప్పని వ్యాయామం, అవసరమైన పోషకాలు, క్యాల్షియం తీసుకుంటే కండరాలు, ఎముకలు జీవితాంతం దృఢంగా ఉంటాయి. కొవ్వు పదార్థాలు తక్కువగా తీసుకోవాలి. పీచు పదార్థం ఎక్కువగా ఉండే పండ్లు, కూరగాయలకు అధిక ప్రాధాన్యతనివ్వాలి. అథిరోస్‌క్లిరోసిస్‌ అధిక రక్తపోటు, మధుమేహం వ్యాధులను అదుపు చేయయగలిగితే హార్మోన్‌ సమస్యలను నివారించవచ్చు.
 
మహిళలూ.. మరింత జాగ్రత్త
ఈస్ట్రోజన్‌ హార్మోన్లు తగ్గిపోవడం వీరిని పలు సమస్యలకు గురిచేస్తుంది. రుతు సంబంధ సమస్యలతో పాటు, కీళ్లనొప్పులు తరచూ వేధిస్తాయి. వీటికి తోడు నిరంతరం దిగులూ ఆందోళనకు లోనవుతారు. అయితే, వీటన్నిటికీ కుటుంబసమస్యలే కారణమనుకుని చాలా మంది వైద్యులను సంప్రదించరు. దీని వల్ల పరిస్థితి మరింత క్షీణిస్తుంది.
 
క్యాల్షియం మోతాదు తగ్గి, ఎముకలు పెళుసుబారిపోతాయి. అతి చిన్న ప్రమాదానికి కూడా ఎముకలు విరిగే ప్రమాదం ఏర్పడుతుంది. హార్మోన్‌ సప్లిమెంట్లుగా మాత్రలు, ఇంజెక్షన్లు, చర్మం మీద అతికించుకునే బిళ్లలు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. అయితే వైద్య పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటేనే మంచి ఫలితాలు ఉంటాయి.