కిడ్నీలోని రాళ్లకు "నారింజ జ్యూస్"తో చెక్!
పొటాషియం సిట్రేట్ సప్లిమెంట్లు అధికంగా ఉండే సిట్రస్ పండ్లను తీసుకుంటే కిడ్నీలో రాళ్ల సమస్యను నివారించవచ్చునని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే మిగిలిన సిట్రస్ ఫలాలకంటే నారింజ పండ్లలోని సిట్రేట్లు మరింత సమర్థవంతంగా పనిచేస్తాయని తాజా అధ్యయనంలో వెల్లడైంది.
సాధారణంగా కాల్షియం వంటి రసాయనాల గాఢత విపరీతంగా పెరిగిపోవటంవల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడుతుంటాయి. ఆపరేషన్ ద్వారా వీటిని తొలగించినప్పటికీ, మళ్లీ మళ్లీ రాళ్లు ఏర్పడుతూనే ఉంటాయి. ఇలాంటివారు రోజుకో గ్లాసెడు నారింజ రసాన్ని తీసుకున్నట్లయితే రాళ్లు క్రమంగా తొలగిపోతాయి. అలాగే పొటాషియం సిట్రేట్ సప్లిమెంట్లు వాడకం ద్వారా కూడా సమస్యను నివారించవచ్చు.
నారింజ రసం తీసుకోవటం వల్ల మూత్రంలోని ఆమ్లతత్వాన్ని తగ్గిస్తుంది. తద్వారా కిడ్నీలో రాళ్లు ఏర్పడటాన్ని నివారిస్తుంది. కాబట్టి కిడ్నీలో రాళ్లను నివారించేందుకు నిమ్మరసం కంటే నారింజ పండ్ల రసం తీసుకోవటం అన్నివిధాలా శ్రేయస్కరమని వైద్యులు సూచిస్తున్నారు.