1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By chitra
Last Updated : మంగళవారం, 5 ఏప్రియల్ 2016 (11:55 IST)

స్త్రీలు అలంకార ప్రియులు ఎందుకో తెలుసా? మగవారూ తీసిపోవట్లేదట!

పార్టీ కెళదామని... ఆఘమేఘాలపై భార్య వద్ద వాలిన భర్త చక్కగా తయారై హాల్లో ఎదురుచూస్తూ, గంటకు పైగానే గడిపేశాడు. ఎంత చూసినా భార్య జాడే కానరాలేదు. ఏమైందనుకుంటూ... డ్రెస్సింగ్‌ రూంలోకి వెళ్ళి చూస్తే... అద్దం ముందు నిలుచుని మేకప్ సరిచేసుకుంటూ అవస్థ పడుతోందామె. ఎంతసేపు మేకప్ చేసుకుంటావు.. వస్తావా, రావా అంటూ విసురుగా వెళ్ళిపోయాడు.
 
పాపం..అతనికే కాదు, చాలామంది మగవాళ్ళకు ఇలాంటి పరిస్థితి ఎదురయ్యే ఉంటుంది. అసలు ఎందుకిలా ఆడవారు గంటల తరబడి మేకప్ చేసుకుంటారనేది వాళ్ళందరి ప్రశ్న. వీరికే కాదు.. కొంతమంది శాస్త్రవేత్తలకు కూడా ఇలాంటి సందేహమే వచ్చింది. రావడమే తరువాయి వెంటనే పరిశోధనలు ప్రారంభించేశారు.
 
ఎట్టకేలకు వీరి పరిశోధనల్లో తేలిన నిజం ఏంటంటే... మహిళలు అద్దం ముందు నిలబడి తమను తాము చూసుకుంటున్నప్పుడు ఎదుటివారు తమను చూసి ఏమనుకుంటారు అని ఆలోచిస్తారట. అంటే ఒక రకంగా ఎదుటివారి ఊహల్లోకి పరకాయ ప్రవేశం చేసి తమను తాము చూసుకుంటుంటారని ఈ పరిశోధకులు తెలిపారు.
 
అందుకే ఆడవారు అలంకరణ విషయంలో ఒక్కో వస్తువు గురించి ఒకటికి పదిసార్లు ఆలోచించుకుంటారు. అందంగా ముస్తాబవుతారు. దానివల్ల ఒరిగే లాభమేంటి? అని చూస్తే... మేకప్ పూర్తయ్యాక ఎదుటివారు తమను చూసి వాహ్ బ్యూటిఫుల్ లేడీ అన్నారంటే, మనసుకు చాలా ఆనందంగా ఉంటుంది కదా..! అందుకే ఎదుటివారు అలా అంటారన్న నమ్మకం కుదిరేంతదాకా వీరు అద్దం విడిచే ప్రసక్తే లేదు మరి..!
 
ఒక రకంగా ఇవన్నీ మనకు మనం వేసుకునే అంచనాలు, ఇచ్చుకునే ప్రోత్సాహమే అనుకుంటే... వీటన్నింటికీ మెదడులోని డోపమైన్ అనే రసాయనమే ముఖ్య కారణమని పరిశోధకులు చెబుతున్నారు. వీరి పరిశోధనల్లో భాగంగా... మేకప్ చేసుకుంటున్న మహిళల మెదడు పనితీరును ఈఎంఆర్ఐ (ఎలక్ట్రో మాగ్నటిక్ రెజొనెన్స్ ఇమేజింగ్) ద్వారా అధ్యయనం చేసినప్పుడు పై విషయాలు వెల్లడయ్యాయి.
 
ఇదిలా ఉంటే... స్త్రీలు అలంకార ప్రియులు అని ఆడిపోసుకుంటుంటారు కదా..! అయితే ఇప్పుడు వీరిని మించిపోయేంతగా మగవారూ అలంకార ప్రియులయిపోయారు. ఇలాంటి వారు అద్దం ముందు నుంచి ఒక పట్టాన కదిలితే ఒట్టు. దువ్విన తలనే దువ్వడం, పౌడర్లు అద్దడం, పెర్‌ఫ్యూమ్‌లు పులుముకోవడం లాంటివి మగవారికీ ఇప్పుడు బాగా అలవాటైపోయింది. పైన మహిళలకు చెప్పినట్లుగానే మగవారుకూడా తమ అందం గురించి ఇతరులు ఎలా అనుకుంటున్నారన్నఆసక్తి ఉంటుందట..!