ఆదివారం, 26 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. వార్తలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , శనివారం, 18 ఫిబ్రవరి 2017 (06:19 IST)

స్టెంట్ ధరల తగ్గింపుతో రోగుల బిల్లులు తగ్గకుండా కార్పొరేట్ల ఆసుపత్రుల అప్రమత్తత

జాతీయ ఔషధ ధరల నియంత్రణ సంస్థ దేశంలో అమ్ముతున్న గుండె ఆపరేషన్‌లకు అత్యవసరమైన స్టెంట్‌ల ధరలను 30 వేల రూపాయలకు తగ్గిస్తూ ఆదేశాలు జారీ చేయడంతో తమకు ఎదురు కానున్న నష్టాన్ని పూడ్చుకునేందుకు నగరంలోని కార్డియాక్ సెంటర్లు అంజియాప్లాస్టీ ఆపరేషన్ ధరలను భారీగా

జాతీయ ఔషధ ధరల నియంత్రణ సంస్థ దేశంలో అమ్ముతున్న గుండె ఆపరేషన్‌లకు అత్యవసరమైన స్టెంట్‌ల ధరలను 30 వేల రూపాయలకు తగ్గిస్తూ ఆదేశాలు జారీ చేయడంతో తమకు ఎదురు కానున్న నష్టాన్ని పూడ్చుకునేందుకు  నగరంలోని కార్డియాక్ సెంటర్లు అంజియాప్లాస్టీ ఆపరేషన్ ధరలను భారీగా పెంచేశాయి. దీని ప్రభావం రోగుల బిల్లులపై ఎలా ఉంటుందంటే, మీ ఆస్పత్రి బిల్లుల్లో జూనియర్ టెక్నికల్ చార్జీలు, జూనియర్ కార్జియాలజీ చార్జీలు, సీనియర్ కార్డియాలజీ చార్జీలు, కేథలాబ్ స్టే చార్జీలు, సర్జన్ స్టాండ్ బై చార్జీలు, ఆసుపత్రిలో ఎక్కువ రోజులు ఉన్నందుకు చార్జీలు ఇలా తడిపిమోపిడన్ని చార్జీలు చేరి కొంప గుల్ల చేయనున్నాయి. ఇప్పటికే ప్రముఖ నగరాల్లో కార్పొరేట్ ఆసుపత్రులు కొన్ని ఈ అధిక చార్జీల మోత మొదలెట్టగా, కొన్ని ఆసుపత్రులు తమకు ప్రభుత్వం నుంచి ఏ సూచనలూ రాలేదంటూ పాత ధరలనే మోపుతున్నాయి. 
 
స్టెంట్ల ధరలు తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో.. ఇక చికిత్సలో దాదాపు రూ.లక్ష వరకైనా తగ్గుతుందని భావించిన బాధితులకు నిరాశే ఎదురవుతోంది. ధరల నియంత్రణ ఆచరణలోకి వచ్చేసరికి నీరుగారిపోతోంది. కొన్ని కార్పొరేట్‌ ఆసుపత్రులతో ఉత్పత్తి సంస్థలు కుమ్మక్కవడంతో బాధితులకు అత్యాధునిక స్టెంట్‌లు లభించడంలేదు. దేశంలో ఎక్కువగా ఉపయోగిస్తున్న స్టెంట్లు రెండు రకాలు. ఒకటి మందుపూత స్టెంట్‌.. రెండోది మందుపూతతో పాటు రక్తనాళాల్లో కరిగిపోయే స్టెంట్‌. ఈ రెండింటిలోనూ కరిగిపోయే స్టెంటే అధునాతనమైనదిగా వైద్యనిపుణులు పేర్కొంటున్నారు. 
 
మందుపూత స్టెంట్‌ ధర సుమారు రూ.30 వేల నుంచి రూ.1.20 లక్షలవరకూ ఉండగా.. కరిగిపోయే స్టెంట్‌ ధర రూ.1.50 లక్షలు. తాజా ధరల స్థిరీకరణతో ఈ రెండు రకాల స్టెంట్ల ధరలనూ రూ.29,600గా నిర్ణయించారు. దీంతో అత్యాధునిక స్టెంట్‌ సరసమైన ధరలోనే లభిస్తుందని బాధితులు ఆనందపడ్డారు. అయితే 80శాతం తగ్గింపు ధరకు ఇవ్వడానికి ఇష్టపడని ఉత్పత్తి సంస్థలు.. అత్యాధునిక ఖరీదైన స్టెంట్‌ను పూర్తిగా విపణినుంచే మాయం చేశాయి. మందుపూత స్టెంట్లనూ విపణి నుంచి ఉపసంహరించుకున్నాయి. 
 
దీంతో ధర తగ్గినా.. ఇప్పటి వరకూ విపణిలో అందుబాటులో ఉన్న అత్యాధునిక మందుపూత, కరిగిపోయే గుణమున్న సెంట్లను పొందే వెసులుబాటు బాధితులకు లేకుండాపోయింది. సుమారు పదేళ్ల కిందటి రకం(పాత మోడల్‌) స్టెంట్లను బాధితులకు అందిస్తున్నట్లు తెలిసింది. తగ్గించిన ధరకు ఏ రకం స్టెంట్‌ గిట్టుబాటు అవుతుందో.. ఆ రకం స్టెంటునే సరఫరా చేస్తున్నట్లు ఓ ఉత్పత్తి సంస్థ ప్రతినిధి పేర్కొన్నారు. 
 
పాత రకం స్టెంట్లను వినియోగించినంత మాత్రాన రోగి ఆరోగ్యంపై పెద్దగా ప్రభావమేమీ పడదని ప్రముఖ కార్డియాలజిస్టు ఒకరు చెప్పారు. ప్రత్యేక సందర్భాల్లో తప్ప సాధారణంగా స్టెంట్‌ పనితీరులో పెద్దగా మార్పు ఉండదని పేర్కొన్నారు. కొన్ని కార్పొరేట్‌ ఆసుపత్రులు యథావిధిగా పాత చికిత్స ధరలనే కొనసాగిస్తున్నాయి. తమకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాచారం లేదనీ, పాత చికిత్స ధరలనే కొనసాగిస్తామని ఓ కార్పొరేట్‌ ఆసుపత్రి ప్రతినిధి చెప్పారు. ఈ విషయంలో రోగులు బాధలు పడుతున్నా... తెలంగాణ ఔషధ నియంత్రణ శాఖ అధికారులు ఇటువైపు దృష్టిపెట్టకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
 
అయితే గుండెజబ్బు బాధితుల ప్రాణాలు కాపాడే స్టెంట్లకు కృత్రిమ కొరత సృష్టించే సంస్థలపై కఠిన చర్యలు తప్పవని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది.