హనుమంత వాహనంపై ఊరేగిన వేంకటేశ్వర స్వామి
తిరుమల బ్రహ్మోత్సవాల సందర్భంగా వేంకటేశ్వర స్వామి సోమవారం ఉదయం హనుమంత వాహనంపై వూరేగారు. ఉదయం 9గంటలకు వాహనం మండపం నుంచి బయటకు వచ్చిన స్వామి భక్తులకు దర్శనమిచ్చారు. దాసభక్తిని చాటుకునే హనుమంతుడుపై వేంకటేశ్వర స్వామి శ్రీరాముని రూపంలో మాడ వీధులలో ఊరేగారు.
స్వామివారి వాహనసేవను తిలకించేందుకు తరలివచ్చిన వేలాది మంది భక్తుల గోవింద నామస్మరణతో తిరుమల గిరులన్నీ మార్మోగాయి. కళాకారుల నృత్యాలు, వేషధారణలు, కోలాటాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఉదయం 11 గంటల ప్రాంతంలో వాహన సేవ ముగిసింది.
