బుధవారం, 6 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. హాలివుడ్
Written By డీవీ
Last Updated : మంగళవారం, 30 ఏప్రియల్ 2024 (11:09 IST)

మర్డర్ మిస్టరీ, సైకో థ్రిల్ చిత్రాలకు మూలకారకుడు దర్శకుడు హిచ్ కాక్

Hitchcock  psycho
Hitchcock psycho
సినిమాకు మూలం విదేశీ చిత్రాలనేది బహిరంగ రహస్యమే. ప్రపంచంలో సైకో, హత్య, థ్రిల్లర్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ దర్శకుడు హిచ్ కాక్ అనేది చెప్పనవసరంలేదు. ఆ తర్వాత పలు సినిమాలు రకరకాల ఫార్మెట్ లో వచ్చాయి. ఇలా భయపెట్టే సినిమాలు రానురాను ఇతర దేశాల్లోనూ ఆయా భాషల్లో వచ్చాయి. ఇప్పుడు మరలా ఆ తరహా సినిమాలు వస్తున్నాయి. ఇంతకు ముందు లారెన్స్, సుందర్ సి. వంటి వారు సినిమాలు తీశారు. తాజాగా  తెలుగులో భయపెట్టే సినిమాలు శబరి, బాక్ మూవీలు రాబోతున్నాయి. అసలు ఇలాంటి సినిమాలకు కేరాఫ్ అడ్రెస్ అయిన హిచ్ కాక్ ను ఓ సారి గుర్తుచేసుకుందాం.
 
హిచ్ కాక్  1968లో నిర్మించిన 'సైకో' చిత్రం ప్రపంచ సినిమా చరిత్రలోనే కొన్ని రికార్డులు  సృష్టించింది. తనకి అన్నివిధాలా పరిపూర్ణమైన సంతృప్తిని కలిగించిన ప్యూర్ సినిమా  'సైకో' అని చెప్పుకున్నాడు హిచ్ కాక్ . మనదేశంలోని కొన్ని థియేటర్లలో సంవత్సరం పైగా ఆడింది 'సైకో' .  అన్ని రోజులు ప్రదర్శించబడిన  మొదటి ఇంగ్లీషు సినిమా బహుశ ఇదేనేమో. ఎనిమిది లక్షల డాలర్లతో నిర్మించిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా వసూళ్ల వర్షం కురిపించాయి. 
 
సినిమా చరిత్రలో అతి భయంకరమైన హత్యగా చెప్పుకునే 'షవర్ బాత్  మర్డర్" ఈ సినిమా లోదే . ఆ రోజుల్లో  'సైకో' సినిమా చూసి వచ్చిన వాళ్ళు స్నానాలగదిలో ఒంటరిగా స్నానం చేయడానికి భయపడేవారు కొన్నాళ్ళపాటు. ప్రేక్షకుల మీద అంతటి ప్రభావాన్ని  కలిగించిన ఆ హత్యని చిత్రీకరించడంలో తన దర్శకత్వపు ప్రతిభనంతా వినియోగించాడు హిచ్ కాక్ . కెమెరా,  లైటింగ్, సౌండ్, ఎడిటింగ్ ప్లస్  డైరెక్షన్ కలిసి సాధించిన అపూర్వ విజయం షవర్ బాత్ మర్డర్ -సీన్. తెరమీద 40 సెకండ్లు మాత్రమే సాగే ఈ హత్యా దృశ్యాన్ని చిత్రీకరించడానికి వారం రోజులు పట్టింది.
 
ఊరికి చివరగా వున్న ఒక హోటల్ గదిలో బాత్రూం తలుపులు చేరవేసి నగ్నంగా స్నానం చేస్తుంటుంది హీరోయిన్ . ఉన్నట్టుండి సుడిగాలిలా బాత్రూం తలుపులు తెరుచుకుని లోపలికి ప్రవేశించిన  ఒక అస్పష్టమైన ఆకారం ఆ అమ్మాయిని కత్తితో పొడిచి చంపి  అదృశ్యమవుతుంది. నిర్జీవమైన  ఆ అమ్మాయి నగ్నశరీరం నేలకొరిగి పోవడం, బాత్రూం గోడలమీదా, నేలమీదా చిందిన నెత్తురు నీళ్ళలో కరిగి సింకు దగ్గర సుడులు తిరిగి పైపు లోపలకి జారిపోవడం - మాటలతో వర్ణించ నలవికాని రీతిలో అద్భుతంగా చిత్రించబడింది. తెర మీద 15 సెకండ్ల సేపు మాత్రమే కనిపించే ఈ దృశ్యంలో 70 షాట్స్  ఉన్నాయంటే నమ్మశక్యం కాదు. అంటే 70 సార్లు కెమెరా పొజిషన్ ని మార్చాల్సి వచ్చిందన్న మాట. మరో విశేషం ఏమిటంటే అసలు చిత్రీకరణలో హంతకుడి చేతిలోని కత్తి ఒక్కసారి కూడా హీరోయిన్ శరీరాన్ని తాకకపోవడం.