శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 7 సెప్టెంబరు 2021 (12:30 IST)

1000 మంది విమానాశ్రయంలోనే... కాబూల్‌లోనే ఫ్లైట్స్

ఆఫ్ఘనిస్తాన్‌లో సాధారణ పరిస్థితులు ఎప్పుడు వస్తాయా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉన్నారు. తాలిబాన్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి.. వీలైనంత త్వరగా పరిస్థితులు అనుకూలంగా మారితే చాలు అని కొందరు అనుకుంటూ ఉండగా.. మరి కొందరేమో ఆ దేశాన్ని విడిచిపెట్టడానికి కావాల్సిన అన్ని దారులు వెతుకుతూ ఉన్నారు. తాలిబాన్లు మాత్రం దేశం సురక్షితమే.. ఎక్కడికీ వెళ్లకండని ప్రజలను కోరుతూ ఉన్నారు. అంతేకాకుండా విమానాలను కూడా కాబూల్ విమానాశ్రయం నుండి వెళ్లనివ్వడం లేదు.
 
కాబూల్‌లో చిక్కుకుపోయిన అమెరికా సహా ఇతర దేశాల పౌరులు, బలగాలు, ఆఫ్ఘన్ శరణార్థులను తరలించేందుకు చర్యలు జరుగుతూ ఉన్నాయి. బల్ఖ్ ప్రావిన్సులోని మజార్-ఎ-షరీఫ్ నుంచి వందలాదిమంది శరణార్థులను విదేశాలకు తరలించేందుకు ఆరు విమానాలను సిద్ధం చేశారు. 
 
అయితే, ఆ విమానాలు వెళ్లకుండా తాలిబన్లు అడ్డుకున్నారని అధికారి ఒకరు తెలిపారు. దీంతో దాదాపు 1000 మంది కొన్ని రోజులు విమానాశ్రయంలోనే గడిపిన అనంతరం మరో మార్గం లేక వారంతా వెనక్కి వెళ్లిపోయారని తెలుస్తోంది. శరణార్థుల విమానాలకు ఇంకా అనుమతి రాలేదని కూడా ఆయన వివరించారు.
 
తాలిబాన్లు మహిళలపై ఎన్నో కఠిన ఆంక్షలను అమలు చేస్తూ వస్తున్నారు. తమ హక్కులు కాపాడాలని.. అన్నిట్లోనూ తమకు అవకాశాలు కల్పించాలని మహిళలు ఓ వైపు పలు నగరాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఆఫ్ఘన్ ప్రధాన పట్టణాల వీధుల్లో వేల మంది మహిళలు తాలిబాన్లకు వ్యతిరేకంగా ర్యాలీలు నిర్వహిస్తున్నారు.