అమెరికాలో మళ్లీ కాల్పుల మోత... ఎనిమిది మంది మృత్యువాత
అగ్రరాజ్యం అమెరికాలో కాల్పుల మోత ఏమాత్రం ఆగడం లేదు. తాజాగా జరిగిన కాల్పుల్లో ఎనిమిది మంది మృత్యువాతపడ్డారు. ఇండియానాపోలిస్‌లో ఉన్న ఎయిర్‌పోర్ట్ వద్ద ఓ సాయుధుడు విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో 8 మంది చనిపోయారు. ఫెడెక్స్ కార్గో డెలివరీ సంస్థ ఆఫీసు వద్ద ఈ ఘటన జరిగింది.
సబ్‌మెషీన్ గన్‌తో ఓ ఉన్మాది భీకరంగా కాల్పులు జరిపాడు. కాల్పుల్లో గాయపడ్డవారు ప్రస్తుతం హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. తొలుత ఆ షూటర్ పరారీలో ఉన్నట్లు తెలిసినా.. అతను ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. అయితే ఎందుకు ఆ సాయుధుడు కాల్పులకు తెగించాడో ఇంకా పోలీసులు నిర్ధారించలేదు. ఈ కాల్పుల ఘటన పట్ల దర్యాప్తు కొనసాగుతున్నది.
రాత్రి 11 గంటల సమయంలో కాల్పుల శబ్ధాలు వినిపించినట్లు స్థానికులు చెప్పారు. ఎయిర్‌పోర్ట్ సమీపం వద్ద ఘటన చోటుచేసుకున్నా.. విమానాల రాకపోకలకు ఎటువంటి అంతరాయం కలగలేదని అధికారులు చెప్పారు. కాల్పుల ఘటనపై ఫెడెక్స్ కొరియర్ సంస్థ ప్రకటన జారీ చేసింది. అధికారులకు సహకరిస్తున్నట్లు చెప్పింది. మృతుల కుటుంబసభ్యులకు సంతాపం తెలిపింది.