కాబూల్‌లో విరుచుకుపడిన ఐఎస్: 63మంది మృతి.. 112 మందికి గాయాలు
ఐఎస్ ఉగ్రవాదుల దాడికి ఆప్ఘనిస్థాన్ రాజధాని కాబూల్ అట్టుడికింది. ఓటర్ల నమోదు కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు జరిపిన ఆత్మాహుతి దాడిలో 63 మంది మృతి చెందగా, 112 మంది గాయాల బారినపడ్డారు. ఆత్మాహు
ఐఎస్ ఉగ్రవాదుల దాడికి ఆప్ఘనిస్థాన్ రాజధాని కాబూల్ అట్టుడికింది. ఓటర్ల నమోదు కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు జరిపిన ఆత్మాహుతి దాడిలో 63 మంది మృతి చెందగా, 112 మంది గాయాల బారినపడ్డారు. ఆత్మాహుతి దాడిలో మరణించిన వారిలో ఎక్కువ శాతం మంది మహిళలు, చిన్నారులేనని ప్రభుత్వం ప్రకటించింది.
ఓటరు నమోదు కేంద్రం వద్దకు తాపీగా నడుచుకుంటూ వచ్చిన ఇస్లామిక్ స్టేట్ ఆత్మాహుతి దళ సభ్యుడు కార్యాలయం గేటు వద్ద తనను తాను పేల్చేసుకున్నాడు. దీంతో ఒక్కసారిగా భయానకంగా మారింది. రక్తం ఏరులై పారింది. పేలుడుతో అరుపులు, కేకలతో ఏం జరిగిందో తెలియ జనాలు పరుగులు తీశారు.
ఈ ఏడాది అక్టోబరులో దేశంలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కాబూల్‌లో ఓటర్ల నమోదు కేంద్రాలు ఏర్పాటు చేసి గుర్తింపు కార్డులు ఇస్తున్నారు. ఇందుకోసం ఆదివారం ప్రజలు పెద్ద ఎత్తున కేంద్రాలకు చేరుకున్నారు. దీంతో ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు.
పేలుడు ధాటికి రెండంతస్తుల ఓటు నమోదు కేంద్రం పూర్తిగా ధ్వంసమైంది. ఈ ఘటనతో తమకు ఎటువంటి సంబంధం లేదని ఆఫ్ఘాన్ తాలిబన్ ప్రకటించింది. కానీ ఇస్లామిక్ స్టేట్ ఓ ప్రకటన చేస్తూ దాడికి పాల్పడింది తామేనని స్పష్టం చేసింది.