'కరోనా' మహమ్మారి జాతీయ విపత్తే.. డోనాల్డ్ ట్రంప్ ప్రకటన
కరోనా వైరస్ మహమ్మారిని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఎట్టకేలకు జాతీయ విపత్తుగా ప్రకటించారు. ఈ వైరస్ దెబ్బకు అమెరికా వణికిపోతోంది. రోజురోజుకూ వైరస్ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. ఈ వైరస్ బారినపడి చనిపోతున్న వారి సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతోంది. తాజాగా కరోనా మరణాల్లో ఇటలీని అమెరికా దాటిపోయింది. దీంతో కరోనాను జాతీయ విపత్తుగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు.
అమెరికా చరిత్రలో ఇలా జాతీయ విపత్తును గుర్తించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. అమెరికాలోని 50 రాష్ట్రాల్లోనూ ఇప్పుడు మహావిపత్తు నెలకొని వుందని ఆయన వ్యాఖ్యానించారు. ఇకపై ఫెడరల్ ప్రభుత్వ నిధులను రాష్ట్రాలు కరోనా నివారణకు, వ్యాప్తి నిరోధానికి వినియోగించుకోవచ్చని వెల్లడించిన ట్రంప్, వైట్‌హౌస్ నుంచే నేరుగా రాష్ట్రాలకు నిధులందుతాయని, ఎమర్జెన్సీ సర్వీస్‌లను ప్రభుత్వం పర్యవేక్షిస్తుందని వెల్లడించారు.
కాగా, అమెరికాలో మరణాల సంఖ్య రోజుకు దాదాపు 2 వేలకు చేరింది. మృతుల విషయంలో ముందున్న ఇటలీని కూడా అమెరికా అధిగమించింది. ఒక్క శనివారమే 1,912 మంది మరణించారని, దీంతో మృతుల సంఖ్య 20,597కు చేరిందని ట్రంప్ ప్రభుత్వం ప్రకటించింది. అలాగే అమెరికాలో 5.33 లక్షల మందికిపైగా వైరస్ సోకిందని, వైరస్ బాధితులకు చికిత్సలు చేస్తున్న డాక్టర్లు, హెల్త్ వర్కర్లు కూడా మరణిస్తూ ఉండటం ఆందోళనను పెంచుతోందని పేర్కొంది.