1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : సోమవారం, 8 మే 2023 (16:47 IST)

పెరు బంగారు గనిలో ప్రమాదం - 27 మంది కార్మికులు మృతి

gold mine
దక్షిణ అమెరికాలోని పెరులో ఘోర ప్రమాదం జరిగింది. గోల్డ్‌మైన్స్‌లో అగ్నిప్రమాదం చోటుచేసుకోవడంతో 27 మంది మృత్యువాతపడ్డారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారు నైట్ షిఫ్ట్‌లో ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. ఇటీవలికాలంలో దేశంలో అత్యంత విషాదకరమైన మైనింగ్ ప్రమాదం ఇదేనని అధికారులు చెబుతున్నారు.
 
ఈ ప్రమాదం అరిక్విపా నగరానికి సమీపంలోని లాఎస్పరెంజా ఒకటో గనిలో జరిగినట్టు స్థానిక మీడియా వెల్లడించింది. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్టు ప్రాథమిక సమాచారం. ప్రమాద సమయంలో గనిలో కార్మికులు వంద మీటర్ల లోతున పనులు చేస్తున్నారని చెప్పారు. ఈ ప్రమాదంలో 27 మంది చనిపోగా 175 మందిని సురక్షితంగా రక్షించినట్టు చెప్పారు. పేలుడు ధాటికి గనిలోని చెక్క వస్తువులు కాలిపోయాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. 
 
కాగా, ప్రమాదం జరిగిన ప్రాంతంలో రోదనలు మిన్నంటాయి. తమ కుటుంబ సభ్యులు మృతి చెందడంతో వారి వారి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఇటీవలి కాలంలో ఆ దేశంలో జరిగిన అత్యంత విషాదకర మైనిగ్ ప్రమాదం ఇదే కావడం గమనార్హం.