శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 10 మార్చి 2023 (11:14 IST)

భారత్‌లో మళ్లీ ప్రయాణించాలని వుంది.. బిల్ గేట్స్

bill gates
తనకు భారత్ అంటే ఎంతో ఇష్టమని, అక్కడ మళ్లీ పర్యటించాలని వుందని మైక్రోసాఫ్ట్ కోఫౌండర్ బిల్ గేట్స్ తన మనస్సులో మాటను వెల్లడించారు. భారత్‌కు వెళ్లిన ప్రతిసారీ కొత్త విషయాలు నేర్చుకునే అవకాశం ఉంటుందని ఆయన చెప్పారు. 
 
ఇటీవల భారత్‌లో పర్యటించిన ఆయన అమెరికా వెళ్లిన తర్వాత తన పర్యటన అనుభవాలను గురించి తన బ్లాగ్‌స్పాట్‌ ‘గేట్స్‌ నోట్స్‌’లో రాసుకొచ్చారు. మళ్లీ వీలైనంత త్వరలోనే భారత్‌కు వెళ్లాలని ఉందని పేర్కొన్నారు. 
 
కొవిడ్‌ మహమ్మారి సమయంలో భారతప్రభుత్వం తీసుకొచ్చిన డిజిటల్‌ లావాదేవీలను బిల్‌గేట్స్ మరోసారి ప్రశంసించారు. భారత్‌ పర్యటనకు సంబంధించిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసి తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. 
 
'భారత్‌ పర్యటన ముగించుకొని వచ్చాను. కానీ, మళ్లీ ఎప్పుడెప్పుడు భారత్‌కు వెళ్తానా? అని తహతహలాడున్నాను. భారత్‌లో పర్యటించడమంటే నాకెంతో ఇష్టం. అక్కడి పరిస్థితులు, ప్రజలు ఎంతగానో ఆకట్టుకున్నారు' అని గేట్స్‌ రాసుకొచ్చారు. 
 
ఈ పర్యటనలో భాగంగా ఢిల్లీ, బెంగళూరు, ముంబై నగరాలను సందర్శించిన ఆయన వివిధ పార్టీల నేతలు, వ్యాపారవేత్తలు, అంకుర సంస్థల ప్రతినిధులు, సామాజిక కార్యకర్తలను కలిసి మాట్లాడినట్లు బ్లాగ్‌లో పేర్కొన్నారు. ముంబైలోని కుర్లా ఆరోగ్యం కేంద్రం, ఢిల్లీలోని ఇండియన్‌ అగ్రికల్చరల్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో దిగిన ఫొటోలతోపాటు ప్రధాని మోదీ, కేంద్రమంత్రి స్మృతి ఇరానీతో దిగిన ఫొటోలను ఇన్‌స్టా వేదికగా ఆయన షేర్ చేశారు.