శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 16 అక్టోబరు 2021 (08:05 IST)

బ్రిటన్‌లో ఎంపీ దారుణ హత్య : కత్తితో పొడిచి చంపిన దండగుడు

ప్రపంచంలోని అగ్రదేశాల్లో బ్రిటన్ ఒకటి. అలాంటి దేశానికి ప్రాతినిథ్యం వహిస్తున్న ఓ ఎంపీ దారుణ హత్యకు గురయ్యాడు. అదీకూడా ఓ దుండగుడి చేతిలో మృతి చెందాడు. గుర్తుతెలియని దుండగుడు కత్తితో విరుచుకుపడి దారుణంగా హత్య చేయడం కలకలం రేపింది. 
 
బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్‌కు చెందిన కన్జర్వేటివ్ పార్టీ నేత, ఎంపీ అయిన డేవిడ్ అమీస్ (69) శుక్రవారం స్థానిక లీ-ఆన్-సీలోని ఓ చర్చిలో నిర్వహించిన ‘మీట్ యువర్ లోకల్ ఎంపీ’ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ క్రమంలో ఆయనపై అకస్మాత్తుగా దాడిచేసిన ఓ వ్యక్తి కత్తితో విచక్షణ రహితంగా పొడిచాడు.
 
తీవ్ర రక్తస్రావమైన ఎంపీని ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. నిందితుడిని అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. అమీస్ 1983 నుంచి ఎంపీగా ఉన్నారు. ఎసెక్స్‌‌లోని సౌత్ఎండ్ వెస్ట్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 
 
జంతు సమస్యలతోపాటు, గర్భస్రావాలకు వ్యతిరేకంగా పోరాడి గుర్తింపు తెచ్చుకున్నారు. అమీస్ మృతికి ప్రజా ప్రతినిధులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనను భయంకరమైనదిగా, తీవ్ర దిగ్భ్రాంతికరమైనదిగా ప్రతిపక్ష లేబర్ పార్టీ అభివర్ణించింది.