శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 15 జనవరి 2020 (16:50 IST)

"కా" చట్టంపై స్పందించిన సత్య నాదెళ్ల... నేను పెరిగిన భాగ్యనగరిలో...

కేంద్రంలోని ప్రధాని నరేంద్ర మోడీ సర్కారు తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ - కా)పై మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల స్పదించారు. సీఏఏపై భారత్‌లో జరుగుతున్నది బాధాకరమని ఆయన వ్యాఖ్యానించారు. ముఖ్యంగా తాను పెరిగిన హైదరాబాద్ నగరంలో ఆ నాటి పరిస్థితులు ఇపుడు లేవని విచారం వ్యక్తం చేశారు. 
 
న్యూయార్క్ వేదికగా మైక్రోసాప్ట్ సంస్థ ఎడిటర్స్ సమావేశం నిర్వహించింది. ఇందులో సత్య నాదెళ్ల పాల్గొని మాట్లాడుతూ, సీఏఏపై భారత్‌లో జరుగుతున్నది బాధాకరం అని అన్నారు. భారత ఆర్థిక వ్యవస్థకు లబ్ధి చేకూర్చే ఓ బహుళజాతి కంపెనీకి బంగ్లాదేశ్‌ నుంచి వలస వచ్చిన వ్యక్తి సారథ్యం వహిస్తే చూడాలని ఉందని చెప్పుకొచ్చారు. ప్రతి దేశం తమ జాతీయ భద్రతను సంరక్షించుకోవాలని, అందుకనుగుణంగా వలస విధానాన్ని ఏర్పరచుకోవాలని సూచించారు. 
 
అంతేకాకుండా, "నేను భారత్‌లో పుట్టి పెరిగాను. నా వారసత్వం పట్ల గర్వంగా ఉంది. నేను పెరిగిన నగరం (హైదరాబాద్‌)లో క్రిస్మస్‌, దీపావళితోపాటు అన్ని ముఖ్య పండుగలను చేసుకునేవాళ్లం. సీఏఏ విషయంలో ప్రస్తుతం జరుగుతున్నది బాధాకరం. అమెరికాలోని సాంకేతిక పరిజ్ఞానం నన్ను ఆకర్షించింది, దాని వలస విధానం నాకు ఇక్కడ (అమెరికాలో) అవకాశం కల్పించింది. అలాగే ఓ బంగ్లాదేశీ భారత్‌కు వచ్చి ఓ యూనికార్న్‌ సంస్థను స్థాపించడమో లేక ఇన్ఫోసిస్‌కు సీఈవోగా బాధ్యతలు చేపట్టడమో చూడాలనుంది.
 
అమెరికాలో నా విషయంలో సాధ్యమైంది భారత్‌లో మరొకరికి సాధ్యం కావాలని ఆకాంక్షిస్తున్నా. ఓ దేశం తన జాతీయ భద్రతపై శ్రద్ధ చూపకూడదన్నది నా అభిప్రాయం కాదు. సరిహద్దులనేవి ఉంటాయి, అవి వాస్తవమైనవి, ప్రజలకు వాటి గురించి తెలుసు. ఇటు అమెరికాలో, అటు యూరప్‌లో వలసలు పెద్ద సమస్యగా పరిణమించాయి.

భారత్‌లో కూడా ఈ సమస్య ఉంది. అయితే వలసలంటే ఏమిటి, వలస వచ్చే వారెవరు, మైనారిటీ గ్రూపులు ఏవి అన్నది తెలుసుకొని, వాటి విషయంలో వ్యవహరించే తీరుపై సమస్య పరిష్కారం ఆధారపడి ఉంటుంది. గందరగోళ ప్రజాస్వామ్యమైన భారత్‌లో ఎట్టకేలకు ఓ అంశం (వలసల)పై చర్చ జరగడం మంచి పరిణామం" అని ఆయన వ్యాఖ్యానించారు.