సీఏఏ మతాలకు అతీతంగా వుండాలి.. సుప్రీం రద్దు చేయాలి: అమర్త్యసేన్
పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై నిరసనలు వ్యక్తమవుతున్న వేళ సీఏఏపై అవగాహన కల్పించేందుకు బీజేపీ ముందుకు వెళ్తోంది. బాలీవుడ్‌కు చెందిన పలువురు ప్రముఖులతో సీఏఏకు మద్దతుగా వీడియో చిత్రీకరణ చేసి సోషల్ మీడియాలో బీజేపీ విడుదల చేసింది.
అయితే సీఏఏ గురించి నోబెల్ పురస్కార గ్రహీత అమర్త్యసేన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఏఏ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని వ్యాఖ్యానించారు. మతపరమైన వ్యత్యాసాలను పౌరసత్వంతో ముడిపెట్టడం సరికాదని అమర్త్యసేన్ పేర్కొన్నారు. సీఏఏ మతాలకు అతీతంగా ఉండాలని చెప్పారు.
అయితే రాజ్యాంగ విరుద్ధమైన ఈ చట్టాన్ని దేశ అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించాలని కోరారు. బెంగళూరులో అమర్త్యసేన్ మీడియాతో మాట్లాడుతూ ఒక వ్యక్తి ఎక్కడ పుట్టాడు? ఎక్కడ నివసిస్తున్నాడు? అనేదే పౌరసత్వాన్ని నిర్ణయిస్తుందన్నారు.
మతం పేరుతో అణచివేతకు గురి చేయాలనే సీఏఏపై రాష్ట్ర అసెంబ్లీలలో చర్చ జరగాలని అమర్త్యసేన్ డిమాండ్ చేశారు. మన దేశానికి వెలుపల ఉన్న హిందువులపై కూడా సానుభూతి చూపాల్సిందేనని, వారిన పరిగణనలోకి తీసుకోవాల్సిందేనని అమర్త్యసేన్ స్పష్టం చేశారు.