గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 16 ఆగస్టు 2022 (14:39 IST)

భారత్ విజ్ఞప్తులు బేఖాతర్... కొలంబో తీరంలో హంబన్‌టొట నిఘా నౌక

china ship
భారత్ ఎంతగా అభ్యంతరాలు తెలిపినప్పటికీ శ్రీలంక నమ్మకద్రోహం చేసింది. చివరి నిమిషంలో శ్రీలంక అనుమతులు ఇవ్వడంతో చైనా నిఘా 'యువాన్‌ వాంగ్‌-5' మంగళవారం ఉదయం 8.30 సమయంలో హంబన్‌టొట రేవుకు చేరుకొంది. 
 
ఈ విషయాన్ని రేవులోని హార్బర్‌ మాస్టర్‌ కెప్టెన్‌ నిర్మల్‌ డిసెల్వ ధ్రువీకరించారు. ఈ నౌక రాకను కొన్ని వారాల ముందే పసిగట్టిన భారత్‌ తక్షణమే స్పందించి శ్రీలంకకు అభ్యంతరాలను తెలియజేసింది. దీనిపై స్పందించిన లంక అధికారులు యువాన్‌ వాంగ్‌-5 ప్రయాణాన్ని వాయిదా వేయాలని చైనా అధికారులను కోరారు. 
 
శ్రీలంక సూచన మేరకు ఈ ప్రయాణం వాయిదా పడినట్లు ప్రచారం జరిగినా.. గత వారం యువాన్‌ వాంగ్‌ హంబన్‌టొట దిశగా వెయ్యి కిలోమీటర్ల దూరంలో కదులుతున్నట్లు గుర్తించారు. ఈ నౌక ప్రయాణాన్ని ఎందుకు వాయిదా వేయాలంటూ చైనా అధికారులు లంక అధికారులను ప్రశ్నించడంతో.. వారు సరైన వివరణ ఇవ్వలేకపోయారు. ఫలితంగా నౌకకు శనివారం లంక అనుమతి మంజూరు చేసింది. 
 
ఈ నౌక శ్రీలంక జలాల్లోకి ప్రవేశించిన తర్వాత ఆటోమేటిక్‌ ఐడెంటిఫికేషన్‌ సిస్టమ్‌ను ఆఫ్‌ చేయాలనే నిబంధనపై అనుమతి ఇచ్చినట్లు కొలంబో అధికారులు చెబుతున్నారు. లంక జలాల్లో ఎటువంటి సర్వేలు నిర్వహించడానికి అనుమతించమని పేర్కొన్నారు. 
 
ఆగస్టు 16-22 మధ్యలో కేవలం ఇంధనం నింపుకోవడానికి మాత్రమే అనుమతి ఇచ్చామని పేర్కొన్నారు. 'యవాన్‌ వాంగ్‌-5 విషయంలో మా పొరుగు దేశాలతో భద్రత, సహకారం తమ అత్యున్నత ప్రాధాన్యం ఇస్తాము. ప్రతి దేశం సార్వభౌమత్వం సమానమే అనే సూత్రానికి అనుగుణంగా అన్ని పక్షాల ప్రయోజనాలు, ఆందోళనను పరిగణనలోకి తీసుకొంటాము' అని శ్రీలంక విదేశాంగశాఖ ఓ ప్రకటనలో పేర్కొంది.