1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 9 ఆగస్టు 2022 (09:25 IST)

చైనాకు షాకివ్వనున్న కేంద్రం : రూ.12 వేలలోపు ఫోన్లపై నిషేధం

mobile phones
చైనా మొబైల్ కంపెనీలకు కేంద్రం షాకివ్వనుంది. దేశీయంగా అత్యధికంగా విక్రమయ్యే రూ.12 వేల లోపు స్మార్ట్ ఫోన్లపై నిషేధ విధించనుంది. వీటిలో స్థానికంగా అస్లెంబ్లింగ్‌/తయారీ చేపట్టిన దేశీయ సంస్థలు కూడా ఈ మోడళ్లే రూపొందిస్తుంటాయి. 
 
అయితే షియామీ, వివో, ఓపో, రియల్‌మీ వంటి చైనా సంస్థల దూకుడుతో, దేశీయ సంస్థలైన లావా, మైక్రోమ్యాక్స్‌ వంటివి మనుగడకు కష్టపడుతున్నాయి. విడిభాగాలు సహా, ఫోన్ల తయారీకి భారీ ప్లాంట్లు కలిగిన చైనా సంస్థలకు పోటీ ఇవ్వలేక, పలు దేశీయ సంస్థలు కార్యకలాపాలు నిలిపేస్తున్నాయి.
 
అందుకే దేశీయ తయారీదార్లను కాపాడుకునేందుకు వీలుగా రూ.12,000లోపు విభాగంలో చైనా సంస్థల ఫోన్లను భారత్‌లో విక్రయించకుండా పరిమితులు విధించేందుకు రంగం సిద్ధమవుతున్నట్లు ఓ నివేదిక వెల్లడించింది. 
 
ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మొబైల్‌ విపణి అయిన మన దేశంలో, ఈ విభాగాన్ని కోల్పోవాల్సి వస్తే చైనా కంపెనీలు తీవ్రంగా నష్టపోనున్నాయి. దేశీయంగా విక్రయమయ్యే ఈ ఫోన్లలో 80 శాతం వాటా చైనా కంపెనీలదే. చైనా సంస్థల తీరు పారదర్శకంగా లేదని ఐటీ శాఖ సహాయమంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ ఇటీవల పేర్కొనడం గమనార్హం. 
 
ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం దీనికి సంబంధించి ప్రత్యేకంగా ఒక విధానం తీసుకొస్తుందా.. లేదంటే అనధికారికంగా ఈ విషయాన్ని చైనా కంపెనీలకు చేరవేస్తుందా.. అనేది తెలియాల్సివుంది.