మక్కా మసీదు మూసివేతకు నిర్ణయం?
సౌదీ అరేబియా ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ముస్లిం సౌదరులు తమ జీవితకాలంలో ఒక్కసారైనా వెళ్లివచ్చే పవిత్ర మక్కా మసీదును మూసివేయనున్నారు. అదీ కూడా పవిత్ర మాసంగా భావించే రంజాన్ నెలలోనే ఈ మసీదును మూసివేయనున్నారు. ఈ నిర్ణయంతో పవిత్ర మక్కాలోని అల్ హరం, అల్ నబవీ మసీదులను మూతపడనున్నాయి.
ప్రస్తుతం ప్రపంచాన్ని కరోనా వైరస్ కబళించింది. ఈ వైరస్ బారినపడిన దేశాల్లో సౌదీ అరేబియా కూడా ఉంది. ఈ దేశంలో కూడా కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు లాక్‌డౌన్ కూడా అమలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రంజాన్ మాసంలో మసీదులు తెరిచివుంచితే కరోనా మహమ్మారి మరింతగా వ్యాపించే అవకాశం ఉందని భావించిన సౌదీ సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది.
వాస్తవానికి రంజాన్ మాసంలో ఉపవాసాల సందర్భంగా ప్రపంచదేశాల నుంచి లక్షలాది మంది మక్కాకు, హజ్ యాత్రకూ వచ్చి, ఇక్కడి మసీదుల్లో ప్రార్థనలు చేస్తుంటారు. ఈ సంవత్సరం ఎటువంటి ప్రార్థనలకూ అనుమతి ఇవ్వబోమని మసీదుల ప్రెసిడెంట్ డాక్టర్ షేఖ్ అబ్దుల్ రహమాన్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ సౌదీస్ తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు.
తరావీ నమాజ్‌లను, రంజాన్ ఈద్ నమాజ్‌ను ముస్లింలంతా ఇళ్లలోనే చేసుకోవాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు. కాగా, ఇప్పటివరకూ సుమారు 10 వేల మందికి పైగా సౌదీ అరేబియాలో కరోనా బారిన పడగా, వారిలో 100 మందికి పైగా మరణించారు.