సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్

పెను తుఫానుగా మారి నేడు తీరం దాటనున్నా మోకా

mocha cyclone
ప్రస్తుతం బంగ్లాదేశ్‌లలోని చిట్టగాంగ్‌కు దక్షిణ నైరుతిగా బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన మోకా తుఫాను శనివారం సాయంత్రానికి సూపర్ సైక్లోన్‌గా మారింది. తుఫాను పరిసరాల్లో గంటకు 255 కిలో మీటర్ల వేగం (130 నాట్స్)తో గాలులు వీస్తుండటంతో సూపర్ సైక్లోనుగా పరిగణిస్తున్నట్టు అమెరికన్ నేవీకి జాయింట్ టైపూన్ వార్నింగ్ సెంటర్ (జేటీడబ్ల్యుసీ) ప్రకటించింది. 
 
ఇది ఆదివారం ఉదయం పది గంటల తర్వాత కొంతమేర బలహీనపడి పెనుతుఫాను మారి మయన్మార్, బంగ్లాదేశ్ మధ్య తీరం దాటుతుందని, ఆ సమయంలో గంటకు 200 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది. కాగా, మోకా సూపర్ సైక్లోన్‌గా మారిందని మన దేశానికి చెందిన ప్రైవేటు వాతావరణ సంస్థ స్కైమెట్ ధ్రువీకరించింది. 
 
అదేవిధంగా మోకా పెను తుఫాను కొనసాగుతున్నట్టు భారత వాతావరణ శాఖ బులెటిన్లు చెబుతున్నాయి. వాతావరణ శాఖ వివరాల ప్రకారం.. శుక్రవారం రాత్రి పెను తుఫానుగా బలపడిన మోకా తర్వాత ఉత్తర ఈశాన్యంగా పయనించి తూర్పు మధ్య బంగాళాఖాతంలో ప్రవేశించింది. 
 
ఇది శనివారం మధ్యాహ్నానికి పోర్టుబ్లెయిర్‌కు 590 కి.మీ. ఉత్తర వాయువ్యంగా ఉంది. పెను తుఫాన్ ఆదివారం ఉదయం బంగ్లాదేశ్, మయన్మార్ తీరం దాటనున్నదని, ఆ సమయంలో గంటకు 170 నుంచి 200 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది.