బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 9 మే 2023 (12:32 IST)

తుఫానుగా మారనున్న మోకా... మయన్మార్ వద్ద తీరం దాటే ఛాన్స్

mocha cyclone
ఆగ్నేయ బంగాళాఖాతం, దానికి ఆనుకుని దక్షిణ అండమాన్ సముద్రంలో సోమవారం ఉదయం అల్పపీడనం కేంద్రీకృతమైంది. ఇది బలపడి మంగళవారానికి వాయుగుండంగా మారనుంది. తర్వాత ఉత్తర వాయవ్యంగా పయనించి తూర్పు మధ్య బంగాళాఖా తంలో ప్రవేశించి ఈనెల పదో తేదీకల్లా తుఫాన్‌గా మారనుంది. ఆపై మరింత బలపడి తీవ్ర తుఫానుగా మారి ఈనెల 11వ తేదీ వరకు తొలుత ఉత్తర వాయవ్యంగా, ఆ తర్వాత దిశ మార్చుకుని ఉత్తర ఈశాన్యంగా పయనిస్తుందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. 
 
ఈశాన్యంగా పయనించే క్రమంలో అతి తీవ్ర తుఫాన్‌గా బలపడి ఈనెల 14న దక్షిణ బంగ్లాదేశ్, మయన్మార్ మధ్య తీరందాటనుందని ఇస్రో వాతావరణ నిపుణుడు ఒకరు తెలిపారు. ఈ తుఫాను 'మోకా'గా అని పేరు పెట్టారు. ఎర్ర సముద్రతీరంలో ఉన్న యెమన్ దేశంలోని నగరం పేరే 'మోకా' అని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. మోకా.. మయన్మార్, బంగ్లా దేశ్ మధ్య తీరం దాటుతుందని అంచనా వేసినప్పటికీ. దీని ప్రభావం ఒడిసా, పశ్చిమబెంగాల్ తీరాలపైనా ఉంటుందని భావిస్తున్నారు. దీంతో ఈ రెండు రాష్ట్రాలు కూడా మోకా పట్ల ఆందోళనగా ఉన్నాయి.