శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 21 జూన్ 2021 (05:54 IST)

చైనాలో 100 కోట్ల డోసులు పంపిణీ

కోవిడ్‌-19 వ్యాక్సినేషన్‌ కార్యక్రమంలో చైనా తాజాగా మరో మైలురాయిని చేరుకుంది. వ్యాక్సినేషన్‌ను ప్రారంభించిన నాటి నుంచి ఇప్పటి వరకు దేశ ప్రజలకు ఇచ్చిన వ్యాక్సిన్‌ డోసుల సంఖ్య 100 కోట్ల మార్కు దాటినట్లు నేషనల్‌ హెల్త్‌ మిషన్‌(ఎన్‌హెచ్‌సి) ఆదివారం పేర్కొంది.

ఈ నెలాఖరుకు నిర్దేశించుకున్న లక్ష్యం దిశగా సాగుతున్నామని ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. దీంతో 100 కోట్లకు డోసులు ఇచ్చిన దేశంగా చైనా ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉంది. ఇది అమెరికాలో ఇచ్చిన డోసులకు మూడు రెట్లు అంటే ప్రపంచవ్యాప్తంగా ఇచ్చిన 250 కోట్ల డోసుల్లో 40 శాతంగా ఉందని అంతర్జాతీయ వార్తా సంస్థ ఎఎఫ్‌పి అంచనా వేసింది.

140 కోట్ల మంది ఉన్న చైనా జనాభాలో జూన్‌ చివరి నాటికి 40 శాతం మందికి పూర్తి వ్యాక్సినేషన్‌ పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యం నిర్దేశించుకుంది. గతేడాది డిసెంబర్‌లో చైనా దేశవ్యాప్త వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ను ప్రారంభించింది. తొలుత ఈ కార్యక్రమం నెమ్మదిగా సాగినా తరువాతి నెలల్లో వేగం పుంజుకుంది.

తొలి, రెండో విడత 10 లక్షల డోసుల పంపిణీని పూర్తి చేసేందుకు నెల రోజులకు పైగా సమయం పట్టగా, తరువాత ఆ వ్యవధి 9, 7, 5 రోజుల వరకు తగ్గింది. మొదటి 50 కోట్ల డోసులను పంపిణీ చేసేందుకు మూడు నెలలకు పైగా సమయం పట్టగా, తరువాతి 50 కోట్ల డోసులను కేవలం నెలలోపే వేయడం గమనార్హం.

వ్యాక్సిన్‌ తీసుకునేలా ప్రజలను ప్రోత్సహించేందుకు ఉచితంగా గుడ్లు, షాపింగ్‌ కూపన్లను చైనా ప్రభుత్వం ఆఫర్‌ చేసింది. దేశంలో వ్యాక్సినేషన్‌ కార్యక్రమానికి చైనా దేశీయంగా సినోఫామ్‌, సినోవ్యాక్‌ సంస్థలు ఉత్పత్తి చేస్తున్న వ్యాక్సిన్లను వినియోగిస్తోంది. 3-17 ఏళ్ల మధ్య పిల్లలకు సినోఫార్మ్‌ రూపొందించిన వ్యాక్సిన్‌కు ప్రభుత్వం ఈ వారం ఆమోదం తెలిపింది.