ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 22 మే 2021 (10:30 IST)

ఏడాదిలో 200 కోట్లకు పైగా డోసులు: కేంద్రం

జనాభాకు సరిపడా కరోనా టీకాలు అందుబాటులో లేకపోవడంతో దేశంలో అనేక రాష్ట్రాలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. ఒక్కో రాష్ట్రానికి ఒక్కోవిధంగా కేంద్రం కేటాయింపులు జరుపుతున్నదనీ, పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నదని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రంపై ఆరోపణలు చేస్తున్న విషయం విదితమే.

అయితే, ఈ తరుణంలో దేశంలో జనాభాకు సరిపడా టీకాలు అందుబాటులో ఉన్నాయా? ఈ ఏడాదిలోపు వ్యాక్సినేషన్‌ ప్రక్రియ పూర్తవుతుందా? టీకా కార్యక్రమం ఇప్పటికే గందరగోళంగా కొనసాగుతున్న తరుణంలో ఈ లక్ష్యం పూర్తవడం సంక్లిష్టంగా కనిపిస్తున్నదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే, కేంద్రం మాత్రం ఈ ఏడాదిలో 200 కోట్లకు పైగా డోసులు అందుబాటులో ఉంటాయని చెప్తున్నది.

దేశంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియను కేంద్రం ఈ ఏడాది జనవరి నుంచి ప్రారంభించింది. దేశీయంగా తయారైన కోవాక్జిన్‌, కోవీషీల్డ్‌ వ్యాక్సిన్‌లను రెండు డోసుల చొప్పున ప్రజలకు ఇచ్చారు. దేశంలో కరోనా సెకండ్‌వేవ్‌ ప్రవేశించడానికి ముందు ఈ కార్యక్రమం స్తబ్దుగా జరిగింది.

అంతేకాకుండా, కరోనా అంతమైందన్న అతివిశ్వాసంతో ఇతర దేశాలకు కేంద్రం వ్యాక్సిన్లను ఎగుమతి చేసిందని నిపుణులు తెలిపారు. అయితే, కరోనా సెకండ్‌వేవ్‌ దేశంలో ప్రవేశించడంతో పరిస్థితులు మారిపోయాయనీ చెప్పారు. రాష్ట్రాలకు టీకాల కొరత ఏర్పడిందని గుర్తు చేశారు.

తొలుత 60 ఏండ్లు పైబడిన వారికి ఇస్తూ వచ్చిన వ్యాక్సిన్‌ను ఆ తర్వాత 45 ఏండ్లు పైబడినవారికి, ఆ తర్వాత 18 ఏండ్లు పైబడిన వారికి ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. అయితే, సరైన ప్రణాళిక లేకుండా కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం వ్యాక్సిన్‌ ప్రక్రియ గందరగోళానికి కారణమైంది.

తగినన్ని టీకాలు లేకపోవడంతో ఆయా రాష్ట్రాలు కూడా 18 ఏండ్లు పైబడినవారికి వ్యాక్సినేషన్‌ ప్రక్రియను నిలిపివేసిన విషయాన్ని ఈ సందర్భంగా ఆరోగ్య నిపుణులు గుర్తు చేశారు. దేశీయ వ్యాక్సిన్ల కొరత ఏర్పడటంతో రష్యా తయారీ స్పుత్నిక్‌ వ్యాక్సిన్‌ దిగుమతికి కేంద్రం పచ్చజెండా ఊపిన విషయాన్ని తెలిపారు.

ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 18 కోట్ల మందికి పైగా వ్యాక్సిన్‌ను ఇచ్చినట్టు మోడీ సర్కారు గొప్పలు చెప్పుకుంటున్నది. అయితే, ఈ సంఖ్య దేశం మొత్తం జనాభాలో 15 శాతం కంటే తక్కువ అని నిపుణులు చెప్పారు. సుమారు 3 శాతం మంది మాత్రమే రెండు మోతాదులను పొందారని తెలిపారు.

అయితే, భారత్‌ వంటి దేశం 60 నుంచి 80 శాతం జనాభాకు అవసరమైన రోగనిరోధకశక్తి చేరుకోవాల్సిన అవసరం ఉన్నదని వారు నొక్కి చెప్పారు. అయితే, వచ్చే ఆగష్టుాడిసెంబర్‌ మధ్యలో రెండు వందల కోట్లకు పైగా డోసులు అందుబాటులో ఉంటాయని కేంద్ర గణాంకాలు చెప్తున్నాయి.

ఇందులో కోవిషీల్డ్‌ 75 కోట్లు, కోవాక్జిన్‌ 55 కోట్లు, బయో ఈ సబ్‌ యూనిట్‌ వ్యాక్సిన్‌ 30 కోట్లు, జైడస్‌ క్యాడిలా డీఎన్‌ఏ వ్యాక్సిన్‌ ఐదు కోట్లు, ఎస్‌ఐఐానోవావ్యాక్స్‌ 20 కోట్లు, బీబీ నాసల్‌ వ్యాక్సిన్‌ 10 కోట్లు, జెన్నోవా ఎంఆర్‌ఎన్‌ఏ వ్యాక్సిన్‌ ఆరు కోట్లు, స్పుత్నిక్‌ వ్యాక్సిన్‌ 15.6 కోట్ల డోసులతో కలిపి మొత్తం 216 కోట్ల డోసులు ఉత్పత్తి లేదా అందుబాటులో ఉండగలవని కేంద్రం సమాచారం. ఇందులో కొన్ని దశలవారి క్లినికల్‌ ట్రయల్స్‌లో ఉండటం గమనార్హం.