గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Modified: సోమవారం, 10 మే 2021 (23:01 IST)

వ్యాక్సిన్ విషయంలో కోర్టుల జోక్యం అనవసరం: కేంద్రం

న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సినేషన్‌ విషయంలో కోర్టుల జోక్యం అనవసరమని కేంద్రం స్పష్టం చేసింది. న్యాయవ్యవస్థ జోక్యం చేసుకుంటే ఊహించని, అనాలోచిత పరిణామాలకు దారితీస్తుందని హెచ్చరించింది. ఈ మేరకు కరోనా వ్యాక్సిన్ ధరలు, కరోనా వ్యాక్సినేషన్ విధానంపై సుప్రీంకోర్టులో కేంద్రం తన వాదనలను వినిపించింది. కాగా దేశంలో కరోనా పరిస్థితులపై సుమోటోగా స్వీకరించిన సుప్రీంకోర్టు.. వ్యాక్సిన్‌ ధరలు, కొరత విషయంలో కేంద్ర ప్రభుత్వంపై  గత వారం పలు ప్రశ్నల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. కేంద్రానికి, రాష్ట్రాలకు వేరువేరు ధరలు ఎందుకని ధర్మాసనం ప్రశ్నించింది. వ్యాక్సిన్ ధరల్ని మరోసారి పరిశీలించాలని కేంద్రాన్ని సుప్రీంకోర్టు కోరింది.  
 
ఈ నేపథ్యంలో వ్యాక్సినేషన్ విధానాన్ని పూర్తిగా సమర్ధించుకుంటూ  కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసింది. ఈ మేరకు కేంద్రం తన వాదనలు వినిపిస్తూ వ్యాక్సిన్‌ ప్రక్రియపై న్యాయస్థానాల జోక్యం అనవసరమని తేల్చి చెప్పింది. ‘ప్రపంచ మహమ్మారి కట్టడికి వైద్య నిపుణులు, శాస్త్రవేత్తల సలహాలు, సూచనలతోనే వ్యూహరచన చేశాం. ఇందులో న్యాయపరమైన జోక్యం అనవసరం. ఏదైనా అతిగా న్యాయపరమైన జోక్యం చేసుకుంటే ఊహించని, అనాలోచిత పరిణామాలకు దారితీయవచ్చు.

టీకా ధరలను సవరించాలని ఉత్పత్తి సంస్థలను ప్రభుత్వం ఒప్పించిన తర్వాత దేశవ్యాప్తంగా వ్యాక్సిన్ల ధర సహేతుకంగా, ఏకరీతిగా ఉంది. పోటీతత్వ మార్కెట్ ఏర్పాటు, ప్రైవేటు వ్యాక్సిన్ తయారీదారులకు ప్రోత్సాహక డిమాండ్‌ను సృష్టించే పద్ధతిలో భాగంగానే టీకా ధరల్లోనే వ్యత్యాసాలు ఉన్నాయి. ఇప్పటికే పలు రాష్ట్రాలు 18 ఏళ్లు పూర్తయిన ప్రతి ఒక్కరికీ ఉచితంగానే వ్యాక్సిన్ అందజేయడానికి ప్రకటనలు చేశాయి.’ అని తెలిపింది.
 
ఇదిలా ఉండగా భారత్‌లో వ్యాక్సిన్ తయారు చేస్తున్న సీరమ్ ఇనిస్టిట్యూట్, భారత్ బయోటెక్ కంపెనీలు ఒకే వ్యాక్సిన్‌కు మూడు ధరలు ప్రకటించాయి. ఇదే ఇప్పుడు వివాదానికి కేంద్ర బిందువుగా మారింది.. కేంద్రానికి 150 రూపాయలకు అమ్ముతున్న ఈ వ్యాక్సిన్‌ను..రాష్ట్రాలకు, ప్రైవేటు ఆసుపత్రులకు మరో ధర నిర్ణయించాయి.

సీరమ్ ఇనిస్టిట్యూట్ అయితే రాష్ట్రాలకు 3 వందల రూపాయలకు, భారత్ బయోటెక్ అయితే రాష్ట్రాలకు 4 వందల రూపాయలకు ధర నిర్ణయించాయి. దీనిపై ప్రస్తుతం సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో సోమవారం వర్చువల్‌ ద్వారా విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. రెండు నిమిషాలకే సాంకేతిక సమస్య కారణంగా జడ్జీలు స్క్రీన్‌పై కనిపించలేదు. అనంతరం సర్వర్‌ డౌన్‌ ఉందని చెప్పి న్యాయమూర్తులంతా నిర్ణయించి విచారణను గురువారానికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.