బుధవారం, 5 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 5 ఫిబ్రవరి 2025 (15:55 IST)

గాజాను స్వాధీనం చేసుకుంటాం : డోనాల్డ్ ట్రంప్

Donald Trump
ఇజ్రాయేల్ దాడిలో ధ్వంసమైన గాజాను స్వాధీనం చేసుకుని తిరిగి పునర్మిస్తామని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఆ ప్రాంతాన్ని ఆర్థికంగా అభివృద్ధి చేస్తే అపరిమితమైన ఉద్యోగ అవకాశాలు కల్పించవచ్చన్నారు. అయితే, ట్రంప్ వ్యాఖ్యలను హమాస్ తీవ్రంగా ఖండించింది. 
 
ఇజ్రాయెల్ - హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధంలో గాజా స్ట్రిప్ పూర్తిగా సర్వనాశనమైన విషయం తెల్సిందే. ఈ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవాలని భావిస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడుగా బాధ్యతలు చేపట్టిన డోనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుతో భేటీ అనంతరం ఆయన ఈ ప్రకటన చేశారు. 
 
గాజాను స్వాధీనం చేసుకున్న తర్వాత అక్కడ ధ్వంసమైన భవనాలను పునర్నిర్మిస్తామని ట్రంప్ తెలిపారు. ఆ ప్రాంతాన్ని ఆర్థికంగా అభివృద్ధి చేస్తే అక్కడి ప్రజలకు అపరిమితమైన ఉద్యోగాలు కల్పించవచ్చని పేర్కొన్నారు. ట్రంప్ ప్రకటనపై నెతన్యాహు స్పందించారు. ఈ నిర్ణయం చరిత్రను మారుస్తుందని కొనియాడారు.
 
కాగా, యుద్ధం కారణంగా గాజాలో నిరాశ్రయులుగా మారిన పాలస్తీనా ప్రజలకు అరబ్ దేశాలు ఆశ్రయం కల్పించాలన్న ట్రంప్ ప్రతిపాదనను ఆయా దేశాలు ఖండించాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. గాజాను తామే స్వాధీనం చేసుకుని అభివృద్ధి చేస్తామని తెలిపారు. అయితే, ట్రంప్ ప్రకటనను హమాస్ ఖండించింది. ఈ ప్రాంతంలో గందరగోళం, ఉద్రిక్తతలు పెంచేందుకే ట్రంప్ ఈ ప్రకటన చేశారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ దురాక్రమణను అడ్డుకుంటామని తెలిపింది.