డోనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం... జన్మతః పౌరసత్వం చట్టం
అమెరికా అధ్యక్షుడుగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత డోనాల్డ్ ట్రంప్ కఠిన, కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇందులోభాగంగా, జన్మతః పౌరసత్వం చట్టాన్ని రద్దు చేశారు. తన ఎన్నికల ప్రచారంలో చెప్పినట్టుగా ఆయన ఈ చట్టంపై వేటు వేశారు. వలస వచ్చిన వారికి అమెరికా గడ్డపై పిల్లలు జన్మిస్తే స్వతహాగా లభించే పౌరసత్వాన్ని అందించే చట్టాన్ని రద్దు చేస్తూ ఆదేశాలు జారీచేశారు.
అక్రమ వలసదారులకు అమెరికాలో జన్మించే పిల్లలకు లభించే జన్మతః పౌరసత్వాన్ని తమ ఫెడరల్ ప్రభుత్వం గుర్తించదని ఈ సందర్భంగా ట్రంప్ వ్యాఖ్యానించారు. అమెరికా మాత్రమే కాదు.. దాదాపు 30 దేశాలు తమ దేశంలో జన్మించిన వారికి జన్మతః పౌరసత్వాన్ని అందిస్తున్నాయి. అయితే, ట్రంప్ మాత్రం తమ దేశంలో మాత్రమే ఇలాంటి చట్టం అమల్లో ఉన్నట్టు తప్పుగా పేర్కొన్నారు.
నిజానికి ఈ చట్టం అమెరికాలో 1868 నుంచే అమల్లో ఉంది. దేశంలో అంతర్యుద్ధం అనంతరం 14వ రాజ్యాంగ సవరణ తర్వాత శరణార్ధుల పిల్లలకు జన్మతః పౌరసత్వాన్ని అందిస్తోంది. అక్రమ చొరబాటుదారులకు పుట్టిన పిల్లలకు, స్టూడెంట్ వీసాపై వచ్చిన వారికి కూడా జన్మతః పౌరసత్వం లభిస్తోంది. ఇప్పుడు ట్రంప్ నిర్ణయంతో జన్మతః పౌరసత్వం ఇక లేనట్టే. అయితే, ట్రంప్ నిర్ణయం తీసుకున్నప్పటికీ న్యాయపరమైన చిక్కులు ఎదురయ్యే అవకాశం లేకపోదేని న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారు.