ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 7 డిశెంబరు 2024 (10:58 IST)

డోనాల్డ్ ట్రంప్ విజయం కోసం ఎలాన్ మస్క్ ఎంత ఖర్చు చేశారో తెలుసా?

musk - trump
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసిన డోనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించారు. ఆయన వచ్చే నెలలో రెండోసారి అధ్యక్ష పీఠాన్ని అధిరోహించనున్నారు. ఈ ఎన్నికల్లో టెస్లా, స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ కీలక పాత్ర పోషించారు. ఇపుడు ఆయన గురించి మరో ఆసక్తికర అంశం వెలుగులోకి వచ్చింది. ట్రంప్ విజయం కోసం ఆయన భారీ మొత్తంలో ఖర్చు చేసినట్టు తాజాగా వార్తలు వస్తున్నాయి. 
 
ఈ మేరకు ఫెడరల్ ఫైలింగ్ ఓ నివేదికను విడుదల చేసింది. ట్రంప్ విజయం కోసం మస్క్ ఏకంగా 270 మిలియన్ డాలర్లు ఖర్చు చేసినట్లు పేర్కొంది. అంటే భారతీయ కరెన్సీలో సుమారు రూ.2 వేల కోట్లు అన్నమాట. గతంలో దాదాపు 200 మిలియన్ డాలర్లు ఇచ్చిన ట్రంప్ మద్దతుదారు టిమ్ మెల్లన్ కంటే మస్క్ ఈ ఎన్నికల్లో ఎక్కువ ఖర్చు చేశారని వాషింగ్టన్ పోస్ట్ పేర్కొంది. 
 
ఇక ట్రంప్ తరపున ఈసారి పొలిటికల్ యాక్షన్ కమిటీ (పీఏసీ) ప్రచార కార్యక్రమాలు నిర్వహించిన విషయం తెలిసిందే. పీఏసీకి మస్క్ 238 మిలియన్ డాలర్లను విరాళంగా ఇచ్చారు. అలాగే ఇతర రూపాల్లో మరికొంత ఇవ్వడం జరిగింది. ఇలా మస్క్ మొత్తంగా 270 మిలియన్ డాలర్లు వెచ్చించారు. అలాగే ట్రంప్ ప్రచార ర్యాలీలలోనూ మస్క్ పాల్గొని మద్దతు తెలిపారు. దీంతో పాటు సోలో క్యాంపెయిన్లు కూడా నిర్వహించారు.
 
ఇక తాను అధ్యక్షుడిగా ఎన్నికైతే ఎలాన్ మస్క్‌కు తన కేబినెట్లో చోటు కల్పిస్తానన్న ట్రంప్.. తన మాట నిలబెట్టుకున్నారు. డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియెన్సీ (డోజ్) బాధ్యతలను మస్క్‌కు అప్పగించారు. అమెరికా ప్రభుత్వ వ్యవస్థలో సమూల మార్పులే డోజ్ ప్రాజెక్టు లక్ష్యమని సంబంధిత అధికారులు చెబుతున్నారు. ఇలా తన ప్రభుత్వంలో మస్క్ కీలక బాధ్యతలు అప్పగించారు.