వ్యాపారిని హతమార్చారు.. ఫ్లాట్‌లోనే ముక్కలు ముక్కలుగా నరికేశారు..
అమెరికాలోని న్యూయార్క్ నగరంలో వ్యాపారి ఫాహిమ్ దారుణ హత్యకు గురయ్యాడు. అతని ఫ్లాట్‌లోనే అతనిని హతమార్చారు. వివరాల్లోకి వెళితే.. బంగ్లాదేశ్ మూలాలున్న దంపతులకు సౌదీ అరేబియాలో జన్మించిన ఫాహిమ్, న్యూయార్క్‌లోనే పెరిగాడు. మూడు పదుల వయసులో 'పథావ్' అనే స్టార్టప్‌ను స్థాపించి బంగ్లాదేశ్‌లో రవాణా, ఫుడ్ డెలీవరి, చెల్లింపుల రంగాల్లో సేవలనందిస్తున్నాడు.
ప్రస్తుతం ఈ సంస్థ మార్కెట్ విలువ 100 మిలియన్ డాలర్లుంటుందని అంచనా. ఈ నేపథ్యంలో ఫాహిమ్ ఆయన ఫ్లాటులోనే ముక్కలు ముక్కలుగా నరకబడ్డాడు. ఫాహిమ్ సోదరి అక్కడికి వచ్చే సరికి ఆయన మృతదేహం రక్తపు మడుగులో పడివుంది. హత్య జరిగిన తీరును చూసిన పోలీసులు... ఈ ఘాతుకానికి బాధ్యులు కిరాయి హంతకులని భావిస్తున్నారు.
అంతేకాదు... మృతుని సోదరి ఫాహిమ్ ఫ్లాట్‌కు వచ్చే సమయంలో కూడా నిందితుడు ఘటనాస్థలిలోనే ఉన్నట్లు భావిస్తున్నారు. ఆమె రాకతో అలికిడి కావడంతో దుండగుడు... ఫ్లాట్ నుంచి తప్పించుకుని ఉంటాడని పోలీసులు చెబుతున్నారు. సీసీ కెమెరాలో సైతం ఓ వ్యక్తి ఫాహిమ్ వెనుకనే వచ్చినట్లుగా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు.