ప్రపంచ దేశాలను అట్టుడికిస్తోన్న కరోనా.. మెక్సికోలో 35వేల మంది మృతి
కరోనా మహమ్మారి వ్యాప్తిని అరికట్టేందుకు దేశాలన్నీ కూడా దశల వారీగా లాక్ డౌన్ విధించినప్పటికీ ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది. రోజురోజుకూ పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇప్పటివరకు ఈ వైరస్ 213 దేశాలకు పాకింది. తాజా సమాచారం ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 13,065,164 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 572,272 మంది కరోనాతో చనిపోయారు.
అలాగే 7,612,389 మంది ఈ వైరస్ బారి నుంచి కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. గడిచిన 24 గంటల్లో ప్రపంచంలో 3956 మరణాలు సంభవించాయి. అయితే మరణాల రేటు కంటే రికవరీ రేటు అధికంగా ఉండటంతో ప్రజలు కాస్త ఊరట చెందుతున్నారు.
ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తోంది. ఈ క్రమంలో మెక్సికోలో కరోనా మరణాలు 35వేలు దాటినట్లు అధికారులు తెలిపారు. సోమవారం నాటికి మెక్సికోలో కరోనా మరణాల సంఖ్య 35,006కు చేరిందని ప్రఖ్యాత వెబ్‌సైట్ తెలిపింది. దీంతో కరోనా కారణంగా అత్యధిక మరణాలు సంభవించిన దేశాల జాబితాలో మెక్సికో నాలుగో స్థానానికి చేరింది.
ఈ జాబితాలో మెక్సికో కన్నా ముందు యూఎస్, బ్రెజిల్, యూకే ఉన్నాయి. అలాగే ఇక్కడ మొత్తమ్మీద 3లక్షలపైగా కరోనా కేసులు నమోదయ్యాయి. అత్యధిక కరోనా కేసులు నమోదైన దేశాల జాబితాలో మెక్సికో ఏడో స్థానంలో ఉంది.
అమెరికా, బ్రెజిల్, రష్యా దేశాల్లో కరోనా తీవ్రతరంగా ఉంది. ప్రస్తుతం అన్ని దేశాలూ లాక్ డౌన్ దశల వారీగా సడలిస్తున్న నేపథ్యంలో ఈ వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంది. అగ్రరాజ్యం అమెరికాలో అత్యధిక కేసులు నమోదవుతున్నాయి.