శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By శ్రీ
Last Modified: సోమవారం, 13 జులై 2020 (21:08 IST)

పోలీసు శాఖలో కరోనావైరస్ పరిస్థితిపై అధికారులతో చర్చించిన హోంమంత్రి

పోలీసు శాఖలో కరోనా వైరస్ పరిస్థితిపై పోలీస్ అధికారులతో రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమ్మద్ మహమూద్ అలీ సోమవారం నాడు చర్చించారు. రాష్ట్రంలోని పోలీస్ కమిషనర్లతో మరియు పోలీసు ఉన్నతాధికారులతో హోంమంత్రి కార్యాలయం నుంచి ఫోన్ ద్వారా వివరాలు అడిగి తెలుసుకున్నారు. పోలీస్ శాఖలో ఈ వైరస్ బారిన పడిన సిబ్బంది గురించి ఆరా తీశారు.
 
వైరస్ బారిన పడిన సిబ్బందికి మనోధైర్యం కలిగేలా అధికారులు ప్రోత్సహించాలని సూచించారు. కరోనా రోగుల పట్ల, వారిని ఆసుపత్రికి తరలించే విషయంలో పోలీస్ సిబ్బంది వ్యవహరించాల్సిన తీరుపై హోంమంత్రి అధికారులతో చర్చించారు. వ్యాధి పట్ల ప్రజలను అప్రమత్తం చేయడంలో పోలీస్ సిబ్బంది చేస్తున్న కృషిని హోంమంత్రి అభినందించారు.
 
"కోవిడ్ వారియర్స్"గా పోలీస్ సిబ్బంది చక్కటి పనితీరును కనబరిచి ప్రజల మెప్పు పొందారని హోంమంత్రి ప్రశంసించారు. ఈ నేపథ్యంలో కొందరు పోలీసు సిబ్బంది వైరస్ బారిన పడ్డప్పటికీ తగిన జాగ్రత్తలు తీసుకుని తిరిగి కోలుకున్నారన్నారు. వ్యాధి బారిన పడినప్పటికీ ఆందోళన చెందవద్దని, చికిత్స, జాగ్రత్తలు తీసుకున్నట్లయితే ప్రమాదం ఉండదన్నారు. తను సైతం వైరస్ బారిన పడి కోలుకొన్న విషయాన్ని హోంమంత్రి ప్రస్తావించారు.
 
కరోనా వ్యాధి పట్ల ఆందోళన చెందకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకొని ప్రజలకు పోలీస్ సిబ్బంది సేవ చేయాల్సి ఉందని పేర్కొన్నారు. తద్వారా ప్రజల ఆదరాభిమానాలు పొందగలుగుతామని అభిప్రాయపడ్డారు. వ్యాధి పట్ల ప్రజలకు అవగాహన కల్పించడంలో పోలీసు అధికారులు, సిబ్బంది వ్యవహరిస్తున్న తీరును హోంమంత్రి అభినందించారు.