కాకరకాయలు కేజీ రూ.1000 - ఆరు మామిడి కాయలు రూ.2400... ఎక్కడ?
సాధారణంగా మన దేశంలో నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని తాకుతుంటాయి. కానీ, ఆ దేశంలో కూరగాయల ధరలు వింటుంటే గుండె పగిలిపోతుంది. వామ్మో ఇంత రేట్లా అని మన దేశ ప్రజలు విస్తుపోతున్నారు. రేట్లు ఇలా మండిపోతుంటే ఏం కొని తినాలని వారు ప్రశ్నిస్తున్నారు. కేజీ కాకరకాయలు రూ.1000, బెండకాయలు కేజీ రూ.650, ఆరు ఆల్ఫోన్సో మామిడికాయలు రూ.2,400 చొప్పున విక్రయిస్తున్నారు. ఇంతలా ధరలు మండిపోతున్న దేశం ఏదో తెలుసా.. బ్రిటన్. ఈ ధరల మండిపాటుకు సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి.
ఢిల్లీకి చెందిన చావి అగర్వాల్ ప్రస్తుతం లండన్‌లో నివసిస్తున్నారు. ఇండియన్ స్టోర్స్‌లో ఉన్న ధరలు చూసి, ఆమె ఆశ్చర్యపోయారు. ఒక స్టోర్‌లో సరకుల రేట్లు చూపిస్తూ ఇన్‌స్టాగ్రాంలో ఒక వీడియోను పోస్టు చేశారు. లేస్ మాజిక్ మసాలా ప్యాక్ భారత్‌లో రూ.20 ఉంటుందని, కానీ లండన్‌లో మాత్రం దాని ఖరీదు రూ.95గా ఉందని చెప్పారు. పన్నీర్ రూ.700 ఉందన్న ఆమె.. కూరగాయల ధరలను వెల్లడించారు. ఈ వీడియో ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతోంది. ఆ ధరలకు నెటిజన్ల మైండ్ బ్లాంక్ అయింది.
అక్కడి కరెన్సీ(పౌండ్ స్టెర్లింగ్)ని మన రూపాయల్లో పోల్చి చూస్తే.. ధరలు ఎక్కువగానే ఉంటాయని, అయితే రేట్లు మాత్రం కాస్త ఎక్కువేననే అభిప్రాయం వ్యక్తమైంది. బ్రిటన్ ప్రజలు ద్రవ్యోల్బణంతో ఇబ్బందిపడుతున్న మాట వాస్తవమే కానీ, ఈ వీడియో కాస్త అతిగా ఉందని ఓ నెటిజన్ స్పందించారు.
అక్కడ వ్యాపారం ప్రారంభిస్తే బెటరేమో అని మరికొందరు ఫన్నీగా బదులిచ్చారు. వచ్చే నెలలో బ్రిటన్‌లో ఎన్నికలు జరగనున్నాయి. జీవన వ్యయ సంక్షోభం అక్కడి ప్రజల్ని ఇబ్బందిపెడుతోంది. బ్రిటన్ ఆర్థిక వ్యవస్థను గాడిన పెడతామన్న హామీతో గద్దెనెక్కిన రిషి సునాక్‌కు మాంద్యం పరిస్థితులు ఎన్నికల వేళ తలనొప్పిగా మారాయి.