గురువారం, 21 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 21 జూన్ 2024 (10:41 IST)

మండిపోతున్న ఎండలు.. కనిపించని నైరుతి ప్రభావం!!

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. రాష్ట్రంలోని నైరుతి రుతుపవనాలు ప్రవేశించినప్పటికీ వరుణుడు మాత్రం ముఖం చాటేశాడు. నిజానికి ఈ యేడాది నైరుతి రుతుపవనాలు నిర్ణీత సమయం కంటే మూడు రోజులు ముందుగానే అంటే జూన్ 2వ తేదీన రాష్ట్రంలోకి ప్రవేశించాయి. గురువారం నాటికి రాష్ట్రమంతటా విస్తరించాయి. కానీ ఉత్తరాంధ్రపై అధిక పీడన ద్రోణి ప్రభావం చూపడంతో స్తబ్దుగా ఉండిపోయాయి. రాష్ట్రమంతటా నైరుతి వ్యాపించినా.. ఆశించిన స్థాయిలో వర్షాలు కురవడం లేదు. ఎండలు మండిపోతున్నాయి. 
 
నైరుతి ప్రవేశించినప్పటి నుంచి ఒకటి, రెండు ప్రాంతాలు మినహా.. ఎక్కడా చెప్పుకోదగ్గ వానలు లేవు. పైగా రాష్ట్రమంతటా నిప్పుల కుంపటిని తలపిస్తోంది. వేడి, ఉక్కపోతతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. మే నెలలో ఉన్నట్లుగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు పెరగడంతో బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు. మరో నాలుగైదు రోజులు ఇదే పరిస్థితి కొనసాగుతుందని, రాత్రి ఉష్ణోగ్రతలు కూడా పెరుగుతాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. మరో ఆవర్తనం లేదా అల్పపీడనం ఏర్పడితేనే వర్షాలు కురిసి.. వాతావరణం చల్లబడుతుందని స్పష్టం చేస్తున్నారు. 
 
ప్రస్తుతం కర్ణాటక, కేరళ తీరాల మీదుగా ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో రాబోయే మూడు రోజుల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. పిడుగులతో పాటు గంటకు 40 నుంచి 50 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయని సూచించింది. శుక్రవారం పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, డా.బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.