శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By
Last Updated : శుక్రవారం, 3 మే 2019 (15:23 IST)

అబుదాబికి రాగులు తీసుకెళ్లిన హైదరాబాదీ అరెస్టు

తన వెంట రాగులు తీసుకెళ్లిన ఓ భారతీయుడుని అబుదాబీ పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత ఆ వ్యక్తి పని చేసే కంపెనీ యాజమాన్యం ఇచ్చిన పూచీకత్తుపై విడుదలయ్యాడు. పైగా, అతను తీసుకెళ్లిన రాగులను పరీక్షల కోసం లేబోరేటరీకి కూడా పంపించారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, హైదరాబాద్ అంబర్‌పేట, మారుతీ నగర్‌కు చెందిన సంతోష్ రెడ్డి (34) అనే వ్యక్తి అబుదాబిలోని ఓ కంపెనీలో పని చేస్తున్నాడు. ఈయన సెలవుపై వచ్చి పది రోజుల క్రితం మళ్లీ ఉద్యోగానికి వెళ్లాడు. 
 
అయితే, ఆయన అబుదాబి వెళుతూ తన వెంట నాలుగు రకాలకు చెందిన రెండు కిలోల రాగులను వెంటతీసుకుని వెళ్లాడు. భారతీయ విమానాశ్రయాల్లో మాత్రం ఆయనకు ఎక్కడా చిక్కులు ఎదురుకాలేదు. కానీ, అబుదాబిలో విమానాశ్రయంలో మాత్రం ఆయన్ను తనిఖీ చేసిన కస్టమ్స్ అధికారులు అరెస్టు చేశారు. 
 
తనవెంట తెచ్చింది ఆహారపు గింజల్లో ఒకటైన రాగులు అని ఎంతగా చెప్పినవారు వినిపించుకోలేదు. పైగా, రాగులను పరీక్షల కోసం లేబోరేటరీకి పంపించారు. ఆ పరీక్షల నివేదిక వచ్చేంతవరకు జైల్లోనే ఉండాలంటూ జైల్లో బంధించారు. అంతేనా, పాస్‌పోర్టును కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయం సంతోష్ రెడ్డి పని చేస్తున్న కంపెనీ యాజమాన్యానికి తెలిసింది. దీంతో వారు వచ్చి వ్యక్తిగత పూచీకత్తు ఇవ్వడంతో సంతోష్ రెడ్డిని విడుదల చేశారు. అదీకూడా బెయిల్‌పైనే విడుదల చేశారు.