గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : సోమవారం, 29 ఏప్రియల్ 2019 (09:34 IST)

పోలీసులను బంట్రోతులు కంటే హీనంగా వాడుతున్నారు : వైఎస్. జగన్

వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ విజయవాడలో ప్రెస్‌మీట్ పెట్టుకోలేని పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిస్థితులు నెలకొనివున్నాయని వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి ఆరోపించారు. ప్రెస్‌మీట్ పెట్టేందుకు విజయవాడకు వచ్చిన రాంగోపాల్ వర్మను ఏపీ పోలీసులు అడ్డుకోవడాన్ని జగన్ తీవ్రంగా తప్పుబట్టారు. పోలీసులను బంట్రోతులు కంటే హీనంగా వాడుకుంటున్నారని ఆయన ఆరోపించారు. 
 
వర్మ తీసిన తాజా చిత్రం 'లక్ష్మీస్ ఎన్టీఆర్‌'కు విడుదల సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో బ్రేక్‌ పడింది. అయితే తాజాగా మే ఒకటిన సినిమా విడుదల చేయాలని నిర్ణయించారు. ఆ వివరాలు చెప్పడానికి ఆదివారం విజయవాడలో మీడియా సమావేశం ఏర్పాటు చేసినట్లు వర్మ ట్విటర్‌లో పేర్కొన్నారు. నోవాటెల్‌ హోటల్‌లో ప్రెస్‌మీట్‌ ఉంటుందని ప్రకటించారు. తర్వాత దాన్ని హోటల్‌ ఐలాపురానికి మార్చారు. 
 
కొద్దిసేపటికే అజిత్‌ సింగ్‌ నగర్‌లోని పైపుల రోడ్డు జంక్షన్‌లో ఉన్న ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద బహిరంగంగా విలేకరుల సమావేశం నిర్వహిస్తానని వర్మ తెలిపారు. చిత్ర నిర్మాత రాకేశ్‌ రెడ్డితో కలిసి రాంగోపాల్‌ వర్మ గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. విమానాశ్రయం వద్దే పోలీసులు అడ్డుకున్నారు. అయినా కారులో పైపుల రోడ్డుకు బయలుదేరారు. ఈ సమాచారాన్ని విమానాశ్రయ పోలీసులు సిటీ పోలీసులకు చేరవేశారు.
 
వర్మ చేసిన తప్పేంటని జగన్ ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. 'విజయవాడలో ప్రెస్‌మీట్ పెట్టలేని పరిస్థితుల్లో మన ప్రజాస్వామ్యం ఉంది. పోలీసుల్ని బంట్రోతులు కన్నా హీనంగా వాడుకునే పరిస్థితుల్లో మన ప్రజాస్వామ్యం ఉంది. ఇదా ప్రజాస్వామ్యం..! చంద్రబాబు గారూ..! ఇంతకీ రామ్ గోపాల్ వర్మ చేసిన తప్పేంటి..?' అంటూ జగన్ ట్వీట్ చేశారు.