శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : బుధవారం, 10 మే 2023 (09:35 IST)

మంటల్లో తగలబడిపోతున్న పాకిస్థాన్.. ఎందుకో తెలుసా?

pakistan agitation
పాకిస్థాన్ దేశం మంటల్లో తగలబడిపోతుంది. ఆ దేశ మాజీ ప్రధానమంత్రి, మాజీ క్రికెట్ దిగ్గజం ఇమ్రాన్ ఖాన్ అరెస్టుతో ఒక్కసారిగా పాకిస్థాన్‌లో అల్లర్లు చెలరేగాయి. ఆందోళనకారులు ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. నిప్పంటిస్తున్నారు. మంగళవారం ఇస్లామాబాద్ హైకోర్టు వెలుపల ఇమ్రాన్ ఖాన్‌ను పాకిస్థాన్ పోలీసులు అరెస్టు చేశారు. దీంతో ఆయన మద్దతుదారులు దేశ వ్యాప్తంగా విధ్వంసానికి దిగారు. ఇమ్రాన్ మద్దతుదారులతో పాకిస్థాన్ వీధులన్నీ నిండిపోయాయి. కార్ప్స్ కమాండర్ ఇంటికి ఆందోళనకారులు నిప్పంటించారు. ఈ అల్లర్లు మరింతగా హెచ్చుమీరిపోకుండా ఉండేందుకు వీలుగా దేశ వ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. సోషల్ మీడియాపై నియంత్రణ విధించారు.
 
పీటీఐ పార్టీ ఛైర్మన్ అయిన ఇమ్రాన్ ఖాన్‌ను మంగళవారం పాక్ పోలీసులు అరెస్టు చేశారు. ఇది దేశ వ్యాప్తంగా అల్లర్లకు దారితీసింది. ఆయనను వెంటనే విడుదల చేయాలని ఇమ్రాన్ మద్దతుదారులు రోడ్లపై ఆందోళనకు దిగారు. ఇస్లామాబాద్, కరాచీ, లాహోర్, రావల్పిండి, గుజ్రాన్‌వాలా, ఫైసలాబాద్, ముల్తాన్, పెషావర్, మర్ధాన్ వంటి వీధులన్నీ ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులతో నిండిపోయాయి. ఇళ్లు, వాహనాలు, కార్యాలయాలపై రాళ్ళ దాడి చేశారు. రోడ్లపై టైర్లు, బ్యానర్లు వేసి తగలబెట్టారు. పోలీసు వాహనాలకు నిప్పంటించారు. 
 
మరికొందరు ఆందోళనకారులు రావల్పిండిలోని ఆర్మీ ప్రధాన కార్యాలయంలోకి చొరబడ్డారు. ప్రధాన ముఖద్వారం గేటును ధ్వంసం చేశారు. వారిని నిలువరించేందుకు పోలీసులు టియర్ గ్యాస్‌ను ప్రయోగించారు. లాహోర్‌లో కార్ప్స్ కమాండర్ ఇంటిని తగలబెట్టారు. అలాగే, కరాచీ, హైదరాబాద్, బలూచిస్థాన్, క్వెట్టాలలోనూ ఆర్మీ కంటోన్మెంట్ ప్రాంతాల్లో పీటీఐ మద్దతుదారులు పెద్ద ఎత్తున గుమికూడారు. ఫైసలాబాద్ పట్టణంలో అంతర్గత శాఖామంత్రి రానా సనావుల్లా ఇంటిపై కొందరు రాళ్లు రువ్వారు. 
 
మరోవైపు, పాకిస్థాన్ దేశ వ్యాప్తంగా సోషల్ మీడియాతో పాటు ట్విట్టర్, ఫేస్‌బుక్, యూట్యూబ్‌లను నియంత్రణలో ఉంచినట్టు డాన్ పత్రిక తెలిపింది. ఇంటర్నెట్ సేవలను నిలిపివేయడం, సోషల్ మీడియాపై భావ ప్రకటనా స్వేచ్ఛను హరించడం తప్ప మరొకటి కాదని ఆమ్నెస్టీ ఇంటర్నోషనల్ ఆందోళన వ్యక్తం చేసింది. వీటిపై నిషేధాన్ని ఎత్తివేయాలని, సేవలను పునరుద్ధరించాలని కోరుతూ పాకిస్ధాన్ టెలీ కమ్యూనికషన్స్, అంతర్గత శాఖా మంత్రిత్వ శాఖను కోరినట్టు తెలిపింది.