‘ఇమ్మిగ్రెంట్ వీసా’ వుంటే రా.. లేకుంటే అమెరికా గడ్డపై అడుగుపెట్టొద్దు... భారత సంతతి మహిళకు చుక్కెదురు
అమెరికాలో మరో భారతీయ సంతతికి చెందిన మహిళకు చుక్కెదురైంది. ఈ మహిళ కెనడా పౌరసత్వం కలిగివుంది. అయినప్పటికీ.. ‘ఇమ్మిగ్రెంట్ వీసా’ ఉంటేనే అమెరికా గడ్డపైకి అనుమతిస్తామంటూ భద్రతా సిబ్రంది తేల్చి చెప్పారు.
అమెరికాలో మరో భారతీయ సంతతికి చెందిన మహిళకు చుక్కెదురైంది. ఈ మహిళ కెనడా పౌరసత్వం కలిగివుంది. అయినప్పటికీ.. ‘ఇమ్మిగ్రెంట్ వీసా’ ఉంటేనే అమెరికా గడ్డపైకి అనుమతిస్తామంటూ భద్రతా సిబ్రంది తేల్చి చెప్పారు. పైగా, ఆరు గంటల పాటు చిత్ర విచిత్ర ప్రశ్నలతో వేధించి... రాచి రంపానబెట్టారు.
30 ఏళ్ల మన్‌ప్రీత్ కూనూర్ అనే యువతి కెనడాలోని భారతీయ దంపతులకు జన్మించింది. శ్వేతజాతీయులైన ఇద్దరు మిత్రులతో కలిసి ఆదివారం అమెరికాలోని వెర్మాంట్ స్పాకు వెళ్లేందుకు బయల్దేరింది. ఆమెను సరిహద్దు భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. ‘ఇమ్మిగ్రెంట్ వీసా’ కావాలంటూ నిలదీశారు. ఈ విషయాలను ఆమె ఫేస్‌బుక్‌లో షేర్ చేయగా, ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
అయితే క్యూబెక్- వెర్మాంట్ సరిహద్దు వద్ద తనిఖీల కోసం అధికారులు వారిని ఆపారు. సాధారణ ప్రయాణాల కోసం అమెరికా వెళ్లే కెనడియన్లకు వీసాలతో పనిలేదు. అయినా ఆమెను ప్రశ్నిస్తూ, ఫోటోలు, వేలిముద్రలు అంటూ ఆరుగంటల పాటు కస్టమ్స్ అధికారులు ముప్పతిప్పలు పెట్టారు. చివరికి అమెరికా వీసా కోసం దరఖాస్తు చేసుకోవాలని చెప్పి పంపించేశారు.
సరే అని మరుసటి రోజు ఆమె మళ్లీ అక్కడికి చేరుకుంటే.. తామేమీ చేయలేమని కస్టమ్స్, సరిహద్దు భద్రతా అధికారులతో మాట్లాడాలంటూ కొర్రీలు పెట్టారు. ఇమ్మిగ్రేషన్ వీసా ఉంటే తప్ప అమెరికాలో అడుగుపెట్టనిచ్చేది లేదని చెప్పేశారు. ఎవరి నుంచి సరైన సమాధానం లేకపోవడంతో తాను నోరుతెరిచి మాట్లాడే పరిస్థితి లేకపోయిందని మన్‌ప్రీత్ పేర్కొంది. మొత్తం మీద తన రంగును బట్టి జాత్యహంకారంతోనే అమెరికా అధికారులు ఇలా ప్రవర్తించినట్టు తనకు అర్థమవుతోందని ఆవేదన వ్యక్తం చేసింది. తనను కూడా వలసదారుగా భావిస్తూ ఇమ్మిగ్రేషన్ వీసా తీసుకోవాలని నిలువరించడం దారుణమని పేర్కొంది.