బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : గురువారం, 25 ఏప్రియల్ 2024 (15:43 IST)

ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి పడి ఉద్యోగం ఊడగొట్టుకున్న భారతీయుడు.. ఎక్కడ?

srivari food
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తిపడిన ఓ భారతీయుడు ఉద్యోగం ఊడగొట్టుకున్నాడు. ఈ ఘటన కెనడాలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, మేహుల్ ప్రజాపతి అనే వ్యక్తి ఓ డేటా సైంటిస్ట్. కెనడాలోని టీడీ బ్యాంకులో పనిచేస్తున్నాడు. అతడి జీతం ఏడాదికి 98 వేల డాలర్లు. జీవితంలో ఉన్నతస్థితికి చేరుకున్న మేహుల్.. తాను ఉచిత ఆహారంతో ఎంత డబ్బు పొదుపుచేసిందీ చెబుతూ ఓ వీడియో చేశాడు. 
 
స్థానికంగా అందుబాటులో ఉన్న ఫుడ్ బ్యాంకుల నుంచి ఆహారం, పచారీ సామాన్లు తీసుకుంటూ వందల కొద్దీ డాలర్లు పొదుపు చేసినట్టు అతడు గర్వంగా చెప్పుకొచ్చాడు. బీదసాదలు, విద్యార్థులను ఆదుకునేందుకు విదేశాల్లో స్వచ్ఛంధ సంస్థలు, ప్రభుత్వాలు ఫుడ్‌బ్యాంక్స్ ఏర్పాటు చేస్తుంటాయి. ఆర్థిక కష్టాల్లో ఉన్నవాళ్లు ఇక్కడి ఆహారంతో కడుపునింపుకుంటూ సేద తీరుతుంటారు. స్థానికులు చాలా మంది ఫుడ్ బ్యాంక్స్‌కు వెళ్లడం అవమానంగా భావిస్తారు. విధిలేని పరిస్థితుల్లోనే ఫుడ్ బ్యాంక్స్‌ను ఆశ్రయిస్తారు.
 
మంచి ఆదాయం ఉండి కూడా మేహుల్ ఫుడ్ బ్యాంకును ఆశ్రయించడం అనేక మందికి ఆగ్రహం తెప్పించింది. పేదల కోసం ఉద్దేశించిన పుడు దొంగిలిస్తున్నాడంటూ అతడిని తిట్టిపోశారు. ఇంతటి సిగ్గుమాలిన పని చేయడం తామెప్పుడూ చూడలేదని అన్నారు. ఈ విషయం వైరల్ కావడంతో మేహుల్ పనిచేస్తున్న బ్యాంకు అతడిని ఉద్యోగం నుంచి తొలగించింది. ఈ విషయాన్ని ఓ ప్రకటన ద్వారా ప్రజలకు తెలియజేసింది. దీంతో, మేహుల్‌కు తగిన శాస్తి జరిగిందంటూ పలువురు హర్షం వ్యక్తం చేశారు. కొందరు మాత్రం అతడి పరిస్థితిపై జాలిపడ్డారు. తెలిసో తెలియకో ఉచిత ఫుడ్ కోసం, వ్యూస్ కోసం కక్కుర్తి పడి చివరకు పరువు పోగొట్టుకున్నాడంటూ విచారం వ్యక్తం చేశారు.