మహిళగా నటించి పేస్‌బుక్ ఫ్రెండ్‌ను పెళ్లి చేసుకున్న యువకుడు!!
ఇండోనేషియాలో ఓ విచిత్ర కేసు ఒకటి వెలుగులోకి వచ్చింది. సోషల్ మీడియాలో పరిచయమైన ఓ మహిళను ప్రేమించి పెళ్లి చేసుకున్న ఓ యువకుడికి తేరుకోలేని షాక్ తగిలింది. తాను పెళ్ళి చేసుకున్నది మహిళ కాదని ఓ యువకుడు అని తెలుకుని దిగ్భ్రాంతికి గురయ్యాడు. పెళ్లయిన కేవలం 12 రోజుల్లోనే ఈ ఘటన జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
ఇండోనేషియాకు చెందిన ఏకే అనే యువకుడికి 2023లో సోషల్ మీడియాలో అడిండా కాంజా అనే యువతి పరిచయమైంది. కొన్ని రోజుల పరిచయం తర్వాత ఇద్దరూ ఓ హోటల్‌లో కలుసుకున్నారు. బురఖాతో హాజరైన అడిండాను చూసి సంప్రదాయం పాటిస్తోందని మురిసిపోయాడు. చేసుకుందామని ప్రపోజ్ చేశాడు. సంతోషంగా ఒప్పుకున్న అడిండా.. తనకు నా అనేవాళ్లు లేరని, ఒంటరినని చెప్పింది. దీంతో తన కుటుంబ సభ్యులను ఒప్పించి ఏకే ఈ నెల 12న ఘనంగా పెళ్లి చేసుకున్నాడు.
వివాహం జరిగిన తర్వాత కూడా అడిండా బురఖా తీయలేదు. నిత్యం బురఖాలోనే ఉండడం, తన ఇంట్లో వాళ్లతో దూరంగా మసలడంతో అనుమానం వచ్చినా కొత్త పెళ్లికూతురు సిగ్గుపడుతోందని ఏకే భావించాడు. తనకు పీరియడ్స్ అని చెప్పి అడిండా భర్తను కూడా దూరంపెట్టింది. రోజులు గడిచినా రాత్రిపూట దూరంగా ఉండడంతో అనుమానించిన ఏకే.. ఆరా తీయగా అసలు విషయం బయటపడింది. అడిండా అసలు అమ్మాయే కాదని, అమ్మాయిలా నటించిన అబ్బాయని తేలింది. అడిండా అసలు పేరు ఈష్ అని, అతడి తల్లిదండ్రులు నిక్షేపంలా బతికే ఉన్నారని బయటపడింది.
2020 నుంచి అడిండా క్రాస్ డ్రెస్సింగ్ చేస్తున్నాడని ఏకే తెలుసుకున్నాడు. దీంతో పోలీసులను ఆశ్రయించి కేసు పెట్టాడు. అడిందా చూడ్డానికి అమ్మాయిలా కనిపించడం, గొంతు కూడా అమ్మాయిలాగే ఉండడంతో ఎవరికీ అనుమానం రాలేదని పోలీసులు చెప్పారు. ఎందుకిలా చేశావని పోలీసులు అడిగితే.. ఏకే ఆస్తిని కాజేయాలనే ఉద్దేశంతోనేనని అడిందా జవాబిచ్చాడట. కాగా, అడిందా చేసిన మోసానికి ఇండోనేషియా చట్టాల ప్రకారం నాలుగేళ్ల శిక్ష పడే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు.